ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డు కావాలంటే కాసులు చెల్లించాల్సిన పరిస్థితి.
దేవరాపల్లి: ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డు కావాలంటే కాసులు చెల్లించాల్సిన పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి మంజూరు చేసిన రేషన్‌కార్డులు రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారుల పాలిట వరంగా మారాయి. సుమారు రెండేళ్ల తర్వాత కార్డులు మంజూరయ్యాయన్న ఆనందంలో వెళ్లిన లబ్ధిదారులను సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక చెల్లిస్తున్నారు.
కనికరించని డీలర్లు
మండలానికి 1458 రేషన్ కార్డులు మంజూ రు కాగా వీటిలో 348 కార్డులను జన్మభూమి సదస్సుల్లో అందజేసేందుకు సిద్ధం చేశారు. వీటిలో కొన్నింటిని సభలలో అధికారులు పంపిణీ చేయగా మిగిలిన వాటిని రెవెన్యూ అధికారుల వద్ద ఉంచినట్లు సమాచారం. కార్డు మంజూరైందని తెలిసి డీలర్‌ను లేదా స్థానిక అధికారులను సంప్రదించగా సొమ్ము చెల్లించాలని చెప్పడంతో కొందరు అడిగినంత చెల్లిస్తున్నారు. అంతమొత్తం ఇవ్వలేనివారు ఉన్నంత ఇస్తామని చెబుతున్నా డీలర్లు మాత్రం కనికరించడం లేదు.
ఒక్కో గ్రామంలో ఒకో రేటు
ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా కార్డులకు ధర నిర్ణయించి లబ్ధిదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మండలంలోని చిననందిపల్లి గ్రామంలో కార్డుకు 300 రూపాయలు చొప్పున సొమ్ము వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మిగిలిన గ్రామాలలోనూ ఇదే తరహాలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. డీలర్ల వసూళ్లలో రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రూ.240 ఇచ్చినా కార్డు ఇవ్వలేదు
నాకు ముగ్గురు కొడుకులు. చిన్న కుమారుడు ప్రసాద్‌తో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి సదస్సులో కార్డు వచ్చిందని తెలియడంతో డీలర్‌ను సంప్రదించాను. 300 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో నా వద్ద ఉన్న 240 చెల్లించాను. కానీ కార్డు ఇంకా ఇవ్వలేదు. -భీమవరపు ముత్యాలమ్మ, చిననందిపల్లి
మా దృష్టికి తీసుకురండి
కొత్త రేషన్ కార్డులు కోసం కేవలం 10 రూపాయలు మాత్రమే చెల్లించాలి. అంతకు మించి ఎక్కువగా ఎవరైనా డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకువస్తే సంబంధిత డీలర్ లేదా అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇకపై వీఆర్వోల సమక్షంలో ఆర్‌ఐల పర్యవేక్షణలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం.
-వైఎస్. నాగరాజు, తహశీల్దార్, దేవరాపల్లి