ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుడు నాగరాజు మృతికి నిరసనగా తోటి అధ్యాపకులు మంగళవారం ఆందోళనకు దిగారు.
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల ఆందోళన
Sep 12 2017 2:05 PM | Updated on Sep 19 2017 4:26 PM
వేంపల్లె : వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుడు నాగరాజు మృతికి నిరసనగా తోటి అధ్యాపకులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి ఆర్ జె యూ కె టి యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని రోడ్డుపై బైఠాయించారు. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన బి. నాగరాజు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ విభాగంలో కాంట్రాక్ట్ అధ్యాపకునిగా పనిచేసేవాడు. పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ప్రకటించగా దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ ప్రకారం తనకు రావాల్సిన ఉద్యోగం వేరే వ్యక్తికి రావడంతో మనస్థాపం చెందాడు.
సమాచార హక్కు చట్టం ద్వారా అవకతవకలు జరిగాయని యూనివర్సిటీపై హై కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ యూనివర్సిటీ అధికారులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ఈ ఏడాది జులై 19న ట్రిపుల్ ఐటీ ఉన్న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప రిమ్స్ లో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడ్డాడు. కానీ మూడు నెలల తర్వాత మళ్ళీ నాగరాజు తన స్వగ్రామంలో తాడేపల్లి గూడెంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా నాగరాజు మృతికి ట్రిపుల్ ఐటీ అధికారులు సంతాప సూచకంగా చిత్ర పటానికి నివాళులు అర్పించేందుకు సన్నాహాలు చేస్తుండగా మంగళవారం తోటి అధ్యాపకులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. మూడు నెలల కిందట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలతో బయటపడితే అప్పుడైన నాగరాజుకు న్యాయం చేసి ఉంటే అతను బతికి వుండే వాడని, అధికారులు నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement