కోనేరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం!

Expose Role Of TDP Leaders In Land Scheme Nellore - Sakshi

సూళ్లూరుపేట (నెల్లూరు): మండలంలో డేగావారికండ్రిగలో సుమారు 1.36 ఎకరాల కోనేరు, ఆర్‌అండ్‌బీ రోడ్డు స్థలాన్ని జిల్లాకు చెందిన మంత్రి  సిఫార్సులతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన డేగా అనే ఇంటిపేరు కలిగిన జమీందార్లుగా ఉండేవారు. వారి ఇంటిపేరుతోనే ఆ గ్రామానికి కూడా డేగావారికండ్రిగ అనే వచ్చిందని ›గ్రామపెద్దలు చెబుతున్నారు. జమీందార్లకు సంబంధించి భూములను అంతా అమ్ముకుని వెళ్లారని, ప్రస్తుతం గంగమ్మ, వినాయకుడి గుడికి వెళ్లే రోడ్డు ఈ ఆలయాల ముందున్న కోనేరు కూడా తమదేనని డేగా కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి దీన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 
సర్వే చేశారు
గతంలో కూడా కోనేరు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినపుడు సర్వే కూడా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. సర్వే నంబర్‌ 157, 157–2ఏ, 157–2బీ, 157–2సీలో సుమారు 1.36 ఎకరాల భూమి దాకా కోనేరు, ఆర్‌అండ్‌బీ రహదారి అని రెవెన్యూ రికార్డులో ఉంది. తన వద్ద రికార్డు ఉందని ఈ భూమి తమది అని కరుణాకర్‌రెడ్డి జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, అధికారపార్టీ నేతల అండదండలతో మా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు.

ఈ వివాదం చాలాకాలంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మంత్రి సిఫార్సులతో రెవెన్యూ «అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ఆలోచనలో కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ భూమి డేగా వారిది కాదని, కోనేరు, ఆర్‌అండ్‌బీ రహదారికి రికార్డులో నమోదై ఉందని, పైపెచ్చు ఈ ప్రాంతంలో గంగమ్మ ఆలయం, వినాయకుడి గుడి ఉండటంతో ఈ రెండు ఆలయాలకు వెళ్లేందుకు దారి అవసరానికి, అలాగే కోనేరుకు మరమ్మతులు చేయించి బాగుచేస్తే పదిమందికి ఉపయోగపడేలా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆ స్థలం గ్రామానిదే 
కోనేరు, రోడ్డు స్థలం గ్రామానికి సంబంధించినదే. డేగా వాళ్లు ఈ గ్రామంలో జమీందార్లుగా ఉన్నమాట వాస్తవమే. వాళ్లు ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుని వెళ్లారు. ఈ పొలం తమది అని జమీందార్లు అన్నపుడు దీనిపై సర్వే చేయించాం. అది పూర్తిగా ఆర్‌అండ్‌బీ రోడ్డు, కోనేరుకు చెందిన స్థలం అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు స్థలం తనది అని కరుణాకర్‌డ్డి రావడం సమంజసం కాదు. మంత్రి సిఫార్సులతో ఆక్రమించే ప్రయత్నాలు మానుకోవాలి. –ఎల్‌.రమ్మణయ్య, మాజీ సర్పంచ్, డేగావారి కండ్రిగ

స్థలాన్ని కాపాడుతూ వచ్చాం 
చిన్నప్పటినుంచి కోనేరు పక్కనే ఉన్న చెట్టుకు నీళ్లుపోసి కాపాడుతూ వచ్చాం. ఈ పొలం ఏ మాత్రం డేగా వారిది కాదు. వినాయకుడి గుడికి, గంగమ్మ గుడికి వెళ్లే దారి కావడం, దీనికి పక్కనే కోనేరు ఉండటం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కోనేరు గురించి ఆలనా పాలనా చూసుకోకపోవడంతో అది పూడిపోయింది. ప్రస్తుతం దీన్ని స్థలంగా చూపించి అక్రమించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. –పుట్టు వెంకటాద్రి, డేగావారి కండ్రిగ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top