బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు  | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

Published Sat, May 25 2019 4:31 AM

Errors in postal ballots - Sakshi

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పొరపాట్లు అభ్యర్థుల తలరాతలు మార్చేశాయి. ఈ పొరపాట్లు కొందరికి వరంగా మారగా, మరికొందరికి శాపంగా పరిణమించాయి. కొన్ని కీలక స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయి. ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్న పోస్టల్, సర్వీస్‌ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటమి అంచుల దాకా వెళ్లిన కొందరు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి గట్టెక్కారు. ఫలితాలు తారుమారై గెలుపు అంచుల వరకు వచ్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో పోస్టల్, సర్వీస్‌ ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 3.05 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 60 వేల సర్వీస్‌ ఓట్లను అధికారులు జారీ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం–12 పూర్తి చేయడంలో తలెత్తిన పొరపాట్లతో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి. కొన్నిచోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం వివాదాస్పదమైంది.


పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు బ్యాలెట్‌ పేపర్‌ మీద వరుస నంబర్‌ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్‌ బ్యాలెట్‌ను పంపే కవర్‌ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటమి బారి నుంచి బయటపడగా, గెలవాల్సిన వారు ఓటమి చెందారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్‌ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో ఇరుపార్టీల మధ్య తీవ్రస్థాయి చర్చ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు చెల్లని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ప్రకటించారు. దాదాపు 6,653 ఓట్ల తేడాతో రామ్మోహన్‌ నాయుడు గెలిచారు.

ఆ స్థానంలో గెలుపు అంచుల దాకా వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఓటమి పాలయ్యారు. గుంటూరు స్థానంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ కూడా ఇలాగే బయటపడ్డారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో భారీగా పోస్టల్‌ బ్యాలెట్‌లు చెల్లకుండా పోయాయి. ఫలితంగా 4,205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై గెలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం పోస్టల్‌ బ్యాలెట్లలో ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాలేదు. భవిష్యత్తులో పోస్టల్‌ బ్యాలెట్లలో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత నిబంధనలను పూర్తిగా మార్చేయడంతో పాటు ఈవీఎంలలోనే ఈ ఓట్లు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ టీచర్ల ఫెడరేషన్‌ అధ్యక్షుడు రామకృష్ణ, ఇతర నేతలు కోరారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement