ఈపీడీసీఎల్‌లో  ఏం జరుగుతోంది..?

EPDCL Chief Secretary Fires On CMD - Sakshi

రూ.720 కోట్ల పనులపై నిర్లక్ష్యమెందుకు.?

అడ్డగోలుగా భూగర్భ కేబుల్‌ పనులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు.?

ఈపీడీసీఎల్‌ సీఎండీ దొరపై సీఎస్‌ ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పది కాదు.. ఇరవై కాదు 720 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ ఎలా ఉండాలి.? ఎలా పడితే అలా భూగర్భ కేబుళ్ల పనులు చేస్తుంటే నియంత్రించకుండా ఏం చేస్తున్నారు.? పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంటే కనీసం పట్టించుకోరా.? అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పినా నిర్లక్ష్యం వహిస్తే ఎలా.? అసలు ఈపీడీసీఎల్‌లో ఏం జరుగుతోందంటూ సీఎండీ దొరపై చీఫ్‌ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్‌ శాఖలో ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ అమరావతిలో 

గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ ముఖ్య అధికారులు, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు(ఏపీడీఆర్‌పీ) కింద చేపడుతున్న భూగర్భ కేబుల్‌ ఏర్పాటు పనుల ప్రస్తావన సమయంలో పై వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు విశాఖలో తొలిసారిగా ప్రారంభించాం. ప్రపంచ బ్యాంకు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.

ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని ఎలా చెయ్యాలి, కానీ.. మీరెలా చేస్తున్నారంటూ’ సీఎండీ దొరపై సీఎస్‌ దినేష్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.720 కోట్ల విలువైన భూగర్భ కేబుల్‌ వ్యవస్థ పనులపై ఈపీడీసీఎల్‌ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో చాలా చోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా పనులు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎండీగా ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా ప్రతి పనినీ పర్యవేక్షించాలని అధికారులను చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top