ఇంజినీరింగ్‌ కళాశాలల వసూళ్ల దందా | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ కళాశాలల వసూళ్ల దందా

Published Mon, Oct 30 2017 1:54 PM

Engineering colleges collection danda

పవన్‌ జేఎన్‌టీయూ అనుబంధ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఎంసెట్‌లో ర్యాంకు రాగానే ఇంజినీరింగ్‌ కళాశాల వారు తమ కళాశాల ఆప్షన్‌ ఎంపిక చేసుకోమని చెప్పారు. లైబ్రరీ, ల్యాబ్, ఇతరత్రా అన్ని రకాల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని వాగ్దానం చేశారు. కళాశాలలో సీటు పొందిన మూడు నెలల తర్వాత ఫీజు మోత ప్రారంభించారు. బిల్డింగ్‌ ఫీజు, ల్యాబ్‌ ఫీజు, లైబ్రరీ ఫీజు, సెమినార్ల ఫీజు అంటూ రకరకాల పేర్లతో అందినకాడికి దోచేస్తున్నారు. ఇలా పవన్‌ ఒక్కరే కాదు... జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని సింహభాగం అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిదీ  ఇదే పరిస్థితి.

జేఎన్‌టీయూ:  ఎన్నికల ముందు రాజకీయ నాయకులు హామీ ఇచ్చినట్టుగా... ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ముందు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అరచేతిలో వైకుంఠం చూపుతారు. అలవికానీ హామీలు ఇస్తారు. వర్సిటీ నిర్ణయించిన కంటే ఒక్కరూపాయి అదనంగా తీసుకోబోమని నమ్మిస్తారు. తమ కళాశాలలో సకల సౌకర్యాలతో పాటు క్యాంపస్‌ ఇంటర్వూ్యలు భారీగా ఉంటాయంటూ వల వేస్తారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సీటు ఆప్షన్‌ ఇచ్చి.. సీటు దక్కిన తర్వాత ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ అసలు రూపం బయట పెడతాయి. ల్యాబ్‌ ఫీజు నుంచి వర్సిటీ ఫీజు, స్కాలర్‌షిప్‌ అప్లికేషన్‌ వరకు వేలాది రూపాయలు అదనంగా వసూలు చేస్తాయి.  ఇష్టం ఉన్నా.. లేకున్నా వారడిగినంత మొత్తం చెల్లించాల్సిందే. పోనీ అదనపు ఫీజులు కట్టలేక చదువుతున్న కళాశాలను వదిలి ..ఇతర కళాశాలకు మార్పు చేయించుకోవడానికి  సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక అదే కళాశాలలోనే కోర్సు పూర్తి చేయాల్సి వస్తోంది.

భరించలేనంత భారం
ఉన్నత, సాంకేతిక విద్యలో నమోదు శాతం పెరగాలి. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వల్లే ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 35 వేల ఫీజును ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది. ఏఎఫ్‌ఆర్‌సీ( అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ) కళాశాలల్లో కోర్సు ఫీజు మొత్తాన్ని పెంచింది. ఉదాహరణకు ఒక కళాశాలలో ఏడాదికి కోర్సు ఫీజు రూ. 50 వేలు అనుకుంటే, రూ.35 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పోనూ .. తక్కిన 15 వేలు కట్టాల్సి ఉంది. ఈ మొత్తం కట్టడానికి తల్లిదండ్రులు ముందే సిద్ధమవుతారు. కానీ కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ నిర్ధారించిన ఫీజులు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది తమకు తలకుమించిన భారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు.

పర్యవేక్షణ లోపం
ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో అధిక ఫీజుల వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులపై ఉంటుంది. అలాగే మౌలిక సదుపాయాలు ఏ మేరకు కల్పించాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన మినహా అనుబంధ కళాశాలల్లో వర్సిటీ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజుల వసూలుకు అడ్డుకట్ట వేయడానికి ఫిర్యాదుల పెట్టే, ఈ– మెయిల్‌ లాంటి రహస్య సదుపాయాలు కల్పిస్తే.. విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం
అధిక ఫీజుల వసూలుతు అడ్డుకట్ట వేయడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఇప్పటికే విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. నేరుగా ఫిర్యాదు చేయడానికి మెయిల్‌ ఐడీని ఇస్తాం.. విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్‌ కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ అనంతపురం

Advertisement

తప్పక చదవండి

Advertisement