దేవుడికే శఠగోపం !

Endowment Employees Doing Fraud In Anantapur - Sakshi

అన్యాక్రాంతమైన దేవుని మాన్యాలు 

ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు 

సాక్షి, అనంతపురం: రాయదుర్గం మండలం కదరంపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి 36 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఆ భూమిని అర్చకుడు జయరాములు సాగు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జయరాములు పేరిట 12 ఎకరాలు, అతని భార్య నిర్మల పేరిట 12 ఎకరాలు, అవివాహితుడైన అతని కుమారుడు కార్తీక్‌ పేరిట 12 ఎకరాలకు ఎండోమెంట్‌ అధికారులు సాగు పత్రాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి 36 ఎకరాల భూమి ఇవ్వడం దేవదాయ ధర్మదాయ, రెవెన్యూ శాఖల చట్టాలకు విరుద్ధం. అలాంటిది గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు ముగ్గురికి సాగు పత్రాలివ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలోని వివిధ ఆలయాల నిర్వహణ కోసం అప్పట్లో కొందరు భూస్వాములు వందల ఎకరాలను ఆయా దేవాలయాలకు రాసిచ్చారు. ఆలయాల్లో పనిచేసే అర్చకులు వాటిని సాగుచేసుకోవడం, లేదా కౌలుకు ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో దేవుళ్లకు దూపదీప నైవేద్యాలు పెడుతూ జీవనం సాగించేవారు. కానీ విలువైన మాన్యం భూములపై కొందరు కన్నేశారు. అధికారుల సాయంతో దేవుడి సొమ్ముకే కన్నం వేశారు.  
ఆలయ భూములన్నీ అన్యాక్రాంతమే రాయదుర్గం నియోజకవర్గంలోని పలు ఆలయాలకు భూములున్నా సంబంధిత ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి.

కొన్నిచోట్ల ఎండోమెంట్‌ 
అధికారులు భూములను నామమాత్రపు వేలంవేసి, కౌలుకు ఇచ్చారు. మరికొన్నిచోట్ల దూప, దీప నైవేద్యాలు పెడతామని కొందరు అర్చకులు సాగుచేసుకుంటున్నారు. ఎక్కువశాతం భూములు అన్యాక్రాంతమయ్యాయి. అయినా దేవదాయశాఖ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం పట్టణం కోటలోని శ్రీప్రసన్న వెంకటరమణస్వామి ఆలయానికి ఆరు ఎకరాల మాన్యాన్ని (పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ), కొండపై ఉన్న శ్రీమాధవరాయుని ఆలయానికి చెందిన 6.14 ఎకరాలను పేదల ఇళ్ల కోసం రెవెన్యూశాఖకు బదలాయించారు. 

రాయదుర్గం మండలంలో 42 దేవాలయాలుండగా 759 ఎకరాల భూమి ఉంది.74 ఉడేగోళం గ్రామ ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 4.69 ఎకరాల భూమిలో గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే మిగిలిన చోట్ల దేవదాయ భూమి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. 

గుమ్మఘట్ట మండలంలో 731.92 ఎకరాల మాన్యం భూములున్నాయి. ఇందులో పూలకుంట వద్ద తిమ్మప్ప మాన్యం సర్వే నంబర్‌ 96లో ఉన్న పొలం ఆక్రమణకు గురైంది. ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా ఇళ్లను నిర్మించుకున్నారు. అడిగేవారు లేక పోవడంతో నిత్యం కబ్జాకు గురవుతున్నాయి. మండలంలోని ఆరు గ్రామాల్లోనూ మాన్యం భూములు అన్యాక్రాంతమవుతున్నా, వారించే నాథులే కరువయ్యారు. 
ఇక డీ.హీరేహాళ్‌ మండలంలోని 15 పంచాయతీల్లో 1034.54 ఎకరాలను దేవాలయాల భూములుగా గుర్తించారు.

అందులో 670 ఎకరాలు భూములు సాగులో ఉన్నాయి. మిగిలిన 364 ఎకరాల్లో కొండలు, గుట్టలు వ్యాపించాయి. గవిసిద్దేశ్వర ఆలయానికి సంబంధించిన భూముల్లోనే కొండలు, గుట్టలున్నాయి. ప్రస్తుతం కూడ్లూరు కంచి వరదరాజస్వామి, డీ.హీరేహాళ్‌లోని గవిసిద్దేశ్వస్వామి, ఆంజనేయస్వామి భూములను కొంతమంది ఆక్రమించుకుని ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. నాగలాపురంలో కాశీవిశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన 39.83 ఎకరాలుండగా... అక్కడి అర్చకులు కొంతమందికి లీజుకు ఇచ్చి కర్ణాటకకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆయా ఆలయాల్లో గ్రామస్తులే దూపదీప నైవేద్యాలను నిర్వహిస్తున్నారు.  బొమ్మనహాళ్‌ మండలంలో 98.37 ఎకరాల మాన్యం భూములుండగా... కొన్ని చోట్ల అర్చకులు సాగు చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భూములు సాగుచేయకపోవడంతో కంపచెట్లు పెరిగాయి.  కణేకల్లు మండలంలో 38.62 ఎకరాల మాన్యం భూములుండగా...అవన్నీ అన్యాక్రాంతమయ్యాయి. కొందరు స్వార్థపరులు మాన్యం భూములను కబ్జా చేసి తమ పేర్లపై పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పొందినట్లు సమాచారం. 

ప్రభుత్వానికే పంగనామాలు 
దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని భూములు సాగుచేసుకుంటున్న వారికి కూడా రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఆ పథకానికి తూట్లు పొడిచేలా దేవదాయ ధర్మదాయ శాఖ ఈఓ శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సాగుపత్రాలున్న రైతుల కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మొదటి విడతలో రూ.11,500  నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే అదనుగా ఈఓ శ్రీనివాసులు ఇష్టారాజ్యంగా ఎంతమందికంటే అంతమందికి సాగు పత్రాలిచ్చి ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నారనే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఈఓను వివరణ కోరడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచాం 
దేవాలయ భూములను సాగు చేసుకుంటున్న వారి జాబితా ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ద్వారా రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఇక్కడి ఈఓ ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి సాగుపత్రాలు ఎలా ఇచ్చాడో తెలియడం లేదు. అలా సాగుపత్రాలు పొందిన వ్యక్తులు ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా.. వాటిని పెండింగులో ఉంచాం. 
– సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top