మళ్లీ ‘గజ’గజ

Elephant Gang Hulchul In Srikakulam District - Sakshi

సూదిరాయిగూడలో ఏనుగుల సంచారం

వరి పంట, అరటి తోటలకు నష్టం

సాక్షి, ఎల్‌.ఎన్‌.పేట: ఏనుగుల బీభత్సం మళ్లీ మొదలైంది. రాత్రి వేళ పంటలను నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని సూదిరాయిగూడ, కరకవలస కొండల్లో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారేంత వరకు సూదిరాయిగూడ గిరిజన గ్రామం సమీపంలో హల్‌చల్‌ చేశాయి. రాత్రి 10 గంటల సమయానికి ఏనుగుల గుంపు సూదిరాయిగూడ గ్రామం సమీపానికి వచ్చాయని గిరిజనులు సరవ వెంపయ్య, సవర సుంబురు, సవర చింగయ్య, సవర సురేష్‌లతోపాటు పలువురు చెప్పారు. వారం రోజులుగా ఏనుగులు గ్రామ సమీపానికి వచ్చి వెళ్లి పోతున్నాయని, గురువారం రాత్రి ఏనుగులు వచ్చే సమయానికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఏనుగులు గ్రామ వీధులోకి వచ్చాయని అప్పుడు మంటలు వేసి ఏనుగులను తరమాల్సి వచ్చిందని గిరిజనులు చెప్పారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత శాఖ సిబ్బందికి ఫోన్‌ చేసినా వారు స్పందించ లేదని ఆరోపించారు.

గ్రామంలో వీధి లైట్లు నాలుగే ఉన్నాయని, వీధి లైట్లు మరో రెండు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారం రోజులుగా ఏనుగులు రావడం, వెళ్లడం వలన సవర వెం పయ్య, సవర సుంబురులకు చెందిన మూడు ఎకరాల వరిచేనును పూర్తిగా కుమ్మేశాయని బాధిత గిరిజనులు వాపోయారు. పోడు పంటగా పండించే కంది, పసుపు పంటలతోపాటు అరటి, కొబ్బరి, జీడి, మామిడి తోటలను నాశనం చేస్తున్నాయని బాధిత గిరిజనులు వాపోతున్నారు. ఏనుగుల దాడి కారణంగా సవర సుంబురు, సవర ప్రసాదరావు, సవర సింగయ్య,   సవర సన్నాయి, సవర వెంపయ్య, సవర సుజాత, సవర జ్యూయల్, సవర ఏసైలకు చెందిన అరటి పసుపు, కంది పంటలను కుమ్మేసి విరిచేస్తున్నాయని బాధిత రైతులు వాపోయారు. పోడు పంటలకు తీరని నష్టం జరిగిందన్నారు. కష్టపడి పండించిన పంటను ఏనుగులు తొండంతో పీకేయడం, కాలితో తొక్కేయడం వలన ఎందుకూ పనికిరాకుండా పోతుందని రోదిస్తున్నారు. ఏనుగుల కారణంగా ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల గుంపు దారి మళ్లించే ప్రయత్నాలు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top