జస్ట్‌ క్లిక్‌..స్విచ్‌ ఆఫ్‌

Electronic Device control With Smart Phones - Sakshi

అంతర్జాల అనుసంధానంతోఎలక్ట్రికల్‌ పరికరాల నియంత్రణ

విద్యుత్‌ ఆదా  వాసవి ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రతిభ

ఉరుకుల పరుగుల జీవితం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకుపరుగులు తీసే వేళ. ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీలు, విద్యుత్‌ పరికరాలుఒకొక్కసారి అలాగే వదిలేసి వెళ్లిపోతుంటారు. ఆఫీస్‌ నుంచివచ్చాక అయ్యో..ఎంత కరెంట్‌ వృథానో అని బాధపడుతుంటారు.  విద్యుత్‌ మోటార్లు కట్టేందుకు అర్ధరాత్రి వేళల్లో కునికి పాట్లుపడుతూ రైతులు పొలాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక్కోసారి చీకట్లో విద్యుదాఘాతానికి గురై ప్రమాదాలబారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలకువాసవి ఇంజినీరింగ్‌ విద్యార్థులు చెక్‌ పెట్టారు. ఎక్కడి నుంచైనాఆటోమేటిక్‌గా స్విచ్‌ ఆఫ్‌ ఆన్‌ అయ్యేందుకు ఓ పరికరాన్ని
రూపొందించారు. దాని సంకేతాలతో స్మార్ట్‌ ఫోన్‌ సాయంతోఎక్కడి నుంచైనా స్విఛ్‌ ఆఫ్‌ ఆన్‌ చేసి చూపించి పలువురి ప్రశంసలందుకుంటున్నారు. వీరు రూపొందించిన పరికరంపైప్రత్యేక కథనం..

పెడన: గృహాల్లోను, కార్యాలయాల్లో, పరిశ్రమలలో వినియోగించే వివిధ రకాల ఎలక్ట్రికల్‌ మోటార్లు, లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్‌ కండిషనర్లు, కంప్యూటర్లు తదితర వాటిని మనిషి ద్వారానే నియంత్రించే పరిస్థితి. ఒక్కో సమయంలో వీటి ద్వారా విద్యుదాఘాతానికి గురై ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాలం ద్వారా వీటిని నియంత్రిం చేలా మండలంలోని శ్రీ వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో నాలుగో సంవత్సరం ఈఈఈ చదువుతున్న విద్యార్థులు ఎలక్ట్రికల్‌ వస్తువులను ఎక్కడ నుంచైనా నియంత్రించేలా పరికరాన్ని కనిపెట్టారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఆధారంగా ఇండస్ట్రీ, హోమ్‌ ఆటోమిషన్‌ అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎస్‌.రామ్‌గణేష్, సి. లీలాసాయికుమార్, ఎంబీఎల్‌ నారాయణ, జెఎస్‌ నరేష్‌ ఒక బృందంగా ఏర్పడి నాలుగు నెలలు శ్రమించి దీనిని రూపొందించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పి. హేమంత్‌కుమార్‌ పర్యవేక్షణలో హెచ్‌వోడీ బి. జ్యోతిలాల్‌ నాయకత్వంలో దీనిని రూపొందించి పరీక్షించారు. విద్యార్థులు రూపొందించిన ఈ పరికరాన్ని కళాశాల కార్యదర్శి మెహర్‌బాబా, కరస్పాండెంటె  కాకి కుమార్‌బాబా, డైరెక్టర్లు సాయికుమార్, దోసపాటి బాబా, ప్రిన్సిపాల్‌ ఏబీ శ్రీనివాసరావులు పరిశీలించి అబ్బురపడి విద్యార్థులను మరింత ప్రోత్సహించారు.

ఇలా చేశారు...
ఈ పరికరంలో ఆర్టీనో మిని, వైఫై మాడ్యుల్స్, బ్లింక్‌ యాప్, ట్రాన్స్‌ఫార్మర్, బ్రిడ్స్‌రెక్టిఫైర్, కెపాసిటర్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించారు. ఆర్టినోమిని అనేది ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం. దీనిని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను నియంత్రించడానికి ఉపయోగించారు. దీనికి అనుసంధానం చేసే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఆన్, ఆఫ్‌ చేయవచ్చు. వైఫై మాడ్యుల్స్‌ ద్వారా వచ్చే అంతర్జాలం ఆర్టీవో మిని ఎలక్ట్రిక్‌  పరికరం, బ్లింక్‌యాప్‌ను అనుసంధానం చేస్తోంది. బ్లింక్‌ యాప్‌ అప్లికేషన్‌ను ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తద్వారా మొబైల్‌ నుంచి ఇచ్చే సందేశాలకు అనుగుణంగా ఆర్టీవో మిని పరికరానికి అనుసంధా నమైన ప్రతి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌  వస్తువులను నియంత్రించవచ్చు. 230/5 కెపాసిటీ గల ట్రాన్స్‌ఫార్మర్‌ అందుబాటులో ఉన్న 230 వాట్స్‌ వోల్టెజిని 5 వాట్స్‌ వోల్టెజిగా తగ్గించి సరఫరా చేస్తోంది. బ్రిడ్జిరెక్టిఫైర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి తీసుకున్న ఏసీ విద్యుత్‌ను డీసీగా మార్చుతుంది. కెపాసిటర్‌ విద్యుత్‌లోని హెచ్చతగ్గులను తొలగించి సమాంతర విద్యుత్‌ను ఆర్టీవోమినికి, వైఫై మాడ్యుల్స్‌కు అందిస్తుంది.

నాలుగు నెలలు...రూ.4వేలు ఖర్చు
చిన్నప్పుడు న్యూస్‌పేపర్లలో విద్యుదాఘాతంతో చనిపోయినవారి గురించి చదివాం. వ్యవసాయ సమయంలో విద్యుత్‌ మోటార్లు వేయడం, ఆఫ్‌ చేయడం వల్ల రైతులు చనిపోయిన సంఘటనల గుర్తుకు వచ్చాయి. సులువుగా ఎటుంటి విద్యుదాఘాతానికి గురికాకుండా ఎక్కడ నుంచైనా ఆన్, ఆఫ్‌ చేసేలా పరికరం రూపొందించాలని నిర్ణయించి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హేమంత్‌కుమార్‌కు తెలిపాం. ఆయన,హెచ్‌వోడీ, కళాశాల యాజమాన్యం ఇచ్చిన ప్రొత్సాహంతో దీనిని కనిపెట్టాం. ఈ పరికరం వల్ల విద్యుత్‌ ఆదా కావడమే కాకుండా విద్యుత్‌ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.
– రామ్‌గణేష్, నారాయణ, లీలాసాయికుమార్, నరేష్‌

మరిన్ని ప్రయోగాలు
విద్యార్థులు రూపొందించిన అంతర్జాలం ద్వారా విద్యుత్‌ పరికరాలను నియంత్రించేలా చేసిన ప్రయోగం బాగుంది. ఇలాంటి ప్రయోగాలతో విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తే వీటిల్లోనే మరింత రాణించేలా సహాయసహకారాలు అందించడానికి మేం ఎప్పుడూ సిద్ధమే. విద్యార్థుల ప్రయోగాలకు కళాశాల యాజమాన్యం కూడా ముందుండి తోడ్పాటును అందిస్తోంది.
– డాక్టర్‌ ఎబి శ్రీనివాసరావు,కళాశాల ప్రిన్సిపాల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top