ఎడ్యుకేషన్ న్యూస్ : విద్యార్ధుల కోసం ప్రత్యేకం..


కొత్త పాలిటెక్నిక్‌లకు రూ. 95 కోట్లు మంజూరు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 13 పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నాబార్డు నిధుల కింద రూ. 81 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల కింద రూ. 14 కోట్లను మంజూరు చేసింది. వీటితో భవనాల అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించాలని ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

 ‘ఓపెన్ వర్సిటీ’ ఉత్తీర్ణులుకాని వారికి మరో చాన్స్!


 సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ 1997-98-99-2000 సంవత్సరాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణులుకాని విద్యార్థులకు వర్సిటీ మరో అవకాశం కల్పించింది. ఆయా విద్యార్థులు రీఅడ్మిషన్ తీసుకుని డిగ్రీ పూర్తి చేసుకోవచ్చు. వివరాలకు వర్సిటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు గురువారం ఓ ప్రకటనలో సూచించారు.

 

 ఏపీసెట్-2013లో వేలిముద్రల సేకరణ

 హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్-2013)కు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఇకపై వేలిముద్రలు సేకరించనున్నట్లు సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షను రాయకుండా నియంత్రించేందుకే కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నవంబరు 24న జరిగే ఏపీసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

 

 బీబీఏ, ఎల్‌ఎల్‌బీ ఫలితాల విడుదల

 ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో గత ఆగస్టులో జరిగిన బీబీఏ, ఎల్‌ఎల్‌బీ పరీక్షల ఫలితాలను వర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫలితాలను www.osmania.ac.in వెబ్‌సైట్లో చూడవచ్చు.

 

 తెలుగు వర్సిటీ దూరవిద్య కోర్సులకు దరఖాస్తులు

 హైదరాబాద్, న్యూస్‌లైన్: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2013-14 విద్యా సంవత్సరానికి దూరవిద్య కోర్సులకు ఆహ్వానం పలికింది. ఎంఏలో జ్యోతిషం, ఆంగ్ల బోధన, తెలుగు, ఎంసీజే, బీఏలో కర్ణాటక సంగీతం, ప్రత్యేక తెలుగు, పీజీ డిప్లొమాలో జ్యోతిర్వాస్తు, టీవీ జర్నలిజం, డిప్లొమాలో జ్యోతిషం, ఫిలిం రైటింగ్, లలిత సంగీతం, సంగీత విశారద, ఆధునిక తెలుగు సర్టిఫికెట్ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 31లోగా దరఖాస్తులు సమర్పించాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం సూచించారు.

 

 ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవీకాలం పొడిగింపు?

 సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఆయన పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం కోసం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా ప్రభుత్వానికి ఫైలును పంపించారు. జయప్రకాశ్‌రావునే చైర్మన్‌గా కొనసాగించాలని ముఖ్యకార్యదర్శి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.

 

 పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం

 సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల నైపుణ్యాలను సమీక్షించేందుకుగాను నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు రాష్ట్ర విద్యా, శిక్షణ మండలితో కలసి మార్గదర్శకాలను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రాజీవ్ విద్యామిషన్‌కు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని అమలును పాఠశాల విద్య కమిషనర్, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డెరైక్టర్, రాష్ట్ర విద్యా, శిక్షణ మండలి డెరైక్టర్ పర్యవేక్షించాలని సూచించారు.

 

 4 నుంచి యోగా ఉపాధ్యాయ శిక్షణ తరగతులు

 సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేయబోయే సప్తరుషి యోగా విద్యాకేంద్రాల పాఠశాలలు, కళాశాలల్లో యోగా ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థులకు నవంబర్ 4 నుంచి శిక్షణ  తరగతులు నిర్వహించనున్నట్లు సప్తరుషి యోగా విద్యాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు, యోగా గురువు బీరెళ్లి చంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top