కరువు ఛాయలు | Draft Symptoms Farmers Problems In Nellore | Sakshi
Sakshi News home page

కరువు ఛాయలు

Aug 13 2018 12:31 PM | Updated on Oct 20 2018 6:19 PM

Draft Symptoms Farmers Problems In Nellore - Sakshi

నెల్లూరు రూరల్‌ మండలంలో నీరు లేక ఎండిపోయిన వరిపైరు

జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. తాగు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో రైతుల బాధలు వర్ణనాతీతం. వరుణుడు సైతం కరుణించక పోవడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా సగం కూడా పడక పోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. 

నెల్లూరు(సెంట్రల్‌) : జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. 2015లో వరదలు వచ్చి వేసిన పంటలు కొట్టుకోని పోయాయి. చెరువులకు గండ్లు పడి చుక్క నీరు లేకుండా పోయింది. 2016లో తీవ్ర అనావృష్టితో రైతులు అవస్థలు పడ్డారు. పెన్నా డెల్టాకింద తప్ప జిల్లా మొత్తం సాగు విస్తీర్ణం తగ్గింది. 2017లో ఓ మోస్తరు వర్షాలు పడ్డా నీరు భూమిలోకి ఇంకి పోవడంతో నీటి చుక్క ఎక్కడా నిల్వ లేదు. 2015లో 33, 2016లో 27 మండలాలను కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో 15 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ఇప్పటి వరకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కరువు మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సింది పోయి ఇంత వరకు వ్యవసాయ శాఖ తరపున ఒక్క రూపాయి కూడా చెల్లించిన దాఖలాల్లేవు.  

ఈ ఏడాది 45 మండలాలు
జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 45 మండలాల్లో తీవ్రంగా కరువు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో జిల్లా మొత్తం కరువు ఛాయల్లో చిక్కుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 173.3 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. అయితే 77.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.

పరిహారం ఎక్కడ?
ప్రభుత్వం నుంచి కరువు మండలాల్లోని రైతులకు ఎటువంటి పరిహారం అందిన దాఖలాల్లేవు. నాలుగు సంవత్సరాలుగా కరువుతో రైతులు అల్లాడుతున్నా వారికి బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యుల్‌ చేస్తామని ప్రభుత్వ ప్రకటనలు నీటిమూటలుగా మారాయనే విమర్శలున్నాయి. జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదనే ఆరోపణలున్నాయి.

నివేదిక పంపుతున్నాం 
జిల్లాలో కరువు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, నమోదైన వర్షపాతం, ఏయే పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. పరిహారం అందించే విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. 
–శివనారాయణ, వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి జేడీ

సాయం లేదు 
కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా పంటకు పెట్టిన పెట్టుబడి రాలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
–కె.వెంకటకృష్ణారెడ్డి, డీసీ పల్లె, మర్రిపాడు

నాలుగేళ్లుగా ఇంతే 
నాలుగు సంవత్సరాలుగా వరిపంట వేసి నీరు లేక ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నేలపాలు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో రుణం కూడా  ఇవ్వడం లేదు. పూర్తిగా రుణమాఫీ కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
–పసుపులేటి వెంకటేశ్వర్లు, వెన్నవాడ, ఆత్మకూర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement