ఇక హామీలొద్దు.. | Dont need fake promises | Sakshi
Sakshi News home page

ఇక హామీలొద్దు..

Jun 7 2015 5:18 AM | Updated on Aug 14 2018 11:26 AM

కడప జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం, ఇక్కడి పండ్ల తోటల్ని దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తాం.

ఎన్నికలకు ముందు లెక్కలేనన్ని హామీలు
అధికార పీఠం ఎక్కాక అవి అమలైంటే ఒట్టు
ఈ మారైనా చేసే పనులే చెప్పాలని జనం వినతి
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
 
 సాక్షి ప్రతినిధి, కడప : కడప జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం, ఇక్కడి పండ్ల తోటల్ని దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తాం. టెర్మినల్ మార్కెట్, రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ నెలకొల్పుతాం. చేనేతల కోసం మైలవరంలో టెక్స్‌టైల్స్ పార్క్, ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. ఒంటిమిట్టను ఫిలిగ్రిం సర్క్యూట్‌లో చేరుస్తూ అభివృద్ధి చేస్తాం. ఇందుకు రూ.50 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కడప-చెన్నై రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తాం. నిరుపయోగంగా ఉన్న ఏపిఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం.
 - ఇవన్నీ జిల్లా ప్రజలకు సీఎం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి

 ఏడాది పూర్తి చేసుకోనున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో చతికిలపడింది. ఉచిత హామీలు తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదు. సీమ నడిబొడ్డున ఉన్న కడపను అన్ని విధాలా ఆదుకుంటామని, తమకు జిల్లా పట్ల ఎలాంటి వివక్ష లేదని పైకి చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పెపైచ్చు వైఎస్సార్ జిల్లా అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, పరిశ్రమలు స్థాపించేం దుకు ముందుకు రావడం లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించారు.

 సీఎం ప్రకటన చూస్తుంటే ఆయన జిల్లాకు మేలు చేస్తున్నట్లు ఏ విధంగా భావించాల్సి ఉంటుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే జిల్లాలో అంతటి భయానక వాతావరణం ఉంటే ఆయన పాలన చేస్తున్నారా.. లేక గాలికొదిలేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదివారం నాటి పర్యటనలోనైనా ఆరోపణలకు తావు లేకుండా నిర్మాణాత్మకంగా హామీలు ఇచ్చి ఆచరణలో చూపెట్టాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. నేటి పర్యటనలో సీఎం విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ఖాజీపేటలో నిర్వహించే జన్మభూమి-మాఊరుకార్యక్రమంలో పాల్గొననున్నారు.  

 టీడీపీ నేతల్లో హైరానా...
 ముఖ్యమంత్రి పర్యటన టీడీపీ నేతల్లో హైరానా సృష్టిస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్వ్రీంద్రారెడ్డి ఉన్నట్లుండి చక్రం తిప్పడంతో టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ అతలాకుతలమౌతున్నారు. జన్మభూమి కార్యక్రమానికి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు ఎవ్వరు హాజరు కాకుండా ఈ పాటికే ఆయన సఫలీకృతుడైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం దేశం శ్రేణులకు మింగుడు పడని వ్యవహారమైంది.

ఇదిలా ఉండలా టీడీపీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలించి సత్తా చాటుకోవాలనే తపన పుట్టా సుధాకర్‌లో మెండుగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం ముఖ్యమంత్రి నిర్వహించే జన్మభూమి ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణుల్లో ఉత్పన్నమౌతోంది. మొత్తానికి ఈమారు టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి పర్యటన ముచ్చెమటలు పట్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement