పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు.. | distribution of pensions .. | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు..

Feb 6 2015 2:41 AM | Updated on Sep 2 2017 8:50 PM

ఎవ్వరిది మోసం..ఎక్కడ జరిగిందిలోపం.. లబ్ధిదారులకు మాత్రం శాపం. నెల రోజులగా ఎదురుచూపులు..గంటలకొద్ది పడిగాపులు..

నెల్లూరు(విద్య) : ఎవ్వరిది మోసం..ఎక్కడ జరిగిందిలోపం.. లబ్ధిదారులకు మాత్రం శాపం. నెల రోజులగా ఎదురుచూపులు..గంటలకొద్ది పడిగాపులు..చివరికి చేతికి వచ్చింది దొంగనోట్లు. వారంత వృద్ధులు, వికలాంగులు, కళ్లు కనిపించని వారు, నడవలేని వాళ్లు గంటల తరబడి పింఛన్ డబ్బులు అందుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి తమ వంతు వచ్చేసరికి దొంగనోట్లు అందడంతో నిరాశచెందారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని 3వ డివిజన్‌లోని సింహపురికాలనీలో బుధవారం ఇద్దరికి రూ.1000ల కాగితాలు దొంగనోట్లు వచ్చాయి. గురువారం ఏకంగా 11 మందికి రూ.1000లు దొంగనోట్లు రావడంతో పింఛన్‌దారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
 
 గొడవ పెద్దదైంది. పింఛన్ పేరుతో దొంగనోట్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? అంటూ పింఛన్‌దారులు అధికారులను నిలదీశా రు. ఎన్ని ఇబ్బందులు పెట్టి తీరా దొంగనోట్లు ఇస్తారా.. అంటూ జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్లు ఇవ్వడాన్ని నిలిపివేశారు. సమాచారమందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దొంగనోట్లను అధికారులు వెనక్కి తీసుకున్నారు. మళ్లీ వారికి వేరే నోట్లను అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లలో దొంగనోట్లు రావడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.

 ప్రజలను కావాలని మోసం చేసేందు కు ప్రభుత్వం ఇలా చేసిందా.. లేక అధికారుల చేతివాటం ఉందని బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. వృద్ధులకు పింఛన్లు పెంచామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం పింఛన్ల కోసం లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఇలా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ప్రక్రియలో దొంగనోట్లు రావడంతో వృద్ధులు శాపనార్ధాలు పెట్టారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియకు అవసరమైన నగదు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తారు. అలాంటిది ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసిన నగదులో దొంగనోట్లు ఎలావచ్చాయి. మోసానికి పాల్పడింది ఎవరో? అనే విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement