'బస్తా'మే సవాల్‌!

Crop Water Stops With Sand Bags in West Godavari - Sakshi

కాలుదువ్వుతున్న తెలంగాణ రైతులు

బేతుపల్లి చెరువు అలుగుపై ఇసుక బస్తాలు

మూలనపడిన ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పథకం

ప్రాజెక్టు ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వంపశ్చిమలో

46 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోవేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఆంధ్రా కాల్వ భవిష్యత్తుపై నీలినీడలు అలముకుంటున్నాయి. జలాశయానికి ఎగువ ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి వచ్చే నీరు పదేళ్లుగా క్రమేపీ తగ్గుతోంది. కొన్నేళ్లుగా  తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడి రైతులు సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగుపై ఇసుక బస్తాలు వేసి ఆంధ్రా కాల్వకు రావాల్సిన నీటిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి చెందినఇరిగేషన్‌ అధికారులు ఇసుక బస్తాలను తొలగించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. కయ్యానికి కాలుదువ్వే విధంగా అక్కడి రైతులవ్యవహారం ఉంది.

పశ్చిమగోదావరి, చింతలపూడి: దశాబ్దాల కాలంగా ఆంధ్రాకాల్వ కింద ఉన్న మెట్ట ప్రాంతంలోని 21 చెరువులతోపాటు జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. తమ్మిలేరు ప్రాజెక్టు ద్వారా ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో అధికారికంగా 9,100 ఎకరాలు సాగవుతుండగా, రిజర్వాయరు ఎగువ భాగంలో 20,230 ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. ఆంధ్రా కాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వివాదంపై ముగ్గురు రాష్ట్ర స్థాయి రిటైర్డ్‌ ఇంజినీర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో శాశ్వతంగా వరద నీరు రాకుండా అక్కడి రైతులు ఇసుక బస్తాలు వేసి వరద నీటిని అడ్డుకుంటున్నారు.

అటకెక్కిన ఇందిరా సాగర్‌
ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకం మూలన పడింది. 2005లో అప్పటి ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,824 కోట్ల నిధులు మంజూరు చేశారు. వేలేరుపాడు మండలం రుద్రమకోట వద్ద శబరి నది, గోదావరి కలిసే చోట ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని 9 మండలాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలకు 24,500 ఎకరాలకు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ఆంధ్రా కాల్వ ద్వారా 46 వేల ఎకరాలకు సాగునీరు అందేలా రూపకల్పన చేశారు. మొత్తం 47 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, పనులు నిలిచిపోయే నాటికి 38 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. సుమారు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు.పంపు హౌస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న భారీ మోటార్లు 10 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోను, ప్రధాన కాల్వలు తెలంగాణలో ఉండటంతో సమస్య నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top