రూ.100 కోట్లకు ఎసరు!

Corruption In Swathi Sunstrokes industries Anantapur - Sakshi

నెలకొల్పని పరిశ్రమకు ఏపీఐఐసీ భూమి కేటాయింపు

ఆరేళ్లుగా అడ్రస్‌ లేని పరిశ్రమ యజమాని

కియా రాకతో హడావుడిగా ప్రహరీ నిర్మాణం

నిబంధనలకు విరుద్ధంగా అద్దెకు భవంతులు

పరిశ్రమ స్థానంలో రెస్టారెంట్‌

పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. ఈ మాటలతో ముందుకొచ్చే సంస్థల పూర్వాపరాలు తెలుసుకోకుండానే అధికారులు రెడ్‌ కార్పెట్‌ పర్చేస్తున్నారు. వేలు కాదు.. లక్షలు కాదు.. కోట్లాది రూపాయల విలువైన భూమిని ధారాదత్తం చేస్తున్నారు. తీరా చూస్తే.. ఉపాధి దేవుడెరుగు, పరిశ్రమ ఊసే లేకుండా పోతోంది. అధికారుల సాక్షిగా.. దక్కించుకున్న స్థలంలో దందా సాగుతోంది. సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు ముసుగులో స్వాతి సన్‌సోర్స్‌ పవర్‌ లిమిటెడ్‌ పాగా వేసిన స్థలం విలువ అక్షరాలా రూ.100 కోట్ల పైమాటే. ఇదంతా ఏపీఐఐసీ అధికారులకు తెలియదా అంటే.. ఇంటి దొంగను     ఈశ్వరుడు కూడా పట్టలేడనే చెప్పాలి.

అనంతపురం టౌన్‌/పెనుకొండ రూరల్‌: స్వాతి సన్‌ సోర్స్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఈ కంపెనీ సూర్యరశ్మి నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ, అల్యూమినియం ప్లేట్లతో(సోలార్‌ ప్లేట్లు) పాటు వాటి విడిభాగాలను తయారు చేసే పరిశ్రమ. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ పరిశ్రమ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఐఐసీ)కి  దరఖాస్తు చేసుకున్నాడు. ఆ మేరకు అధికారులు పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ పక్కనున్న సర్వే నంబర్లు 85–1,2,4, 86–1, 87, 72–2, 72–3లలోని 45.17ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 2012 జూలై 26న కంపెనీకి సేల్‌ అగ్రిమెంట్‌ చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటి వరకు పరిశ్రమ ఊసే లేకపోవడం గమనార్హం.

పరిశ్రమ స్థలంలో భవంతులు     నిర్మించి అద్దెకు..
కేటాయించిన స్థలంలో నాలుగేళ్లుగా ప్రహరీ గోడ నిర్మించారు. ఇంతలోనే పెనుకొండ దగ్గరలో కియా పరిశ్రమ నెలకొల్పుతున్నట్లు ప్రకటిచండంతో పనులను వేగవంతం చేశారు. పెద్ద పెద్ద భవంతులను నిర్మించారు. పరిశ్రమ త్వరలోనే ప్రారంభం అవుతుందని నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురు చూశారు. భవంతులు కూడా పూర్తయ్యాయి. సోలార్‌ ప్లేట్ల తయారీకి అవసరమైన యంత్రాలను మాత్రం తీసుకురాలేదు. నిర్మించిన పెద్ద పెద్ద భవంతులను కియా పరిశ్రమ కోసం వచ్చిన కొరియన్స్‌కు నెలవారీ అద్దెకు ఇచ్చేశారు. ఇంతటితో ఆగకుండా కొరియన్స్‌ సౌకర్యార్థం అక్కడే పరిశ్రమ స్థలంలోనే ఒక రెస్టారెంట్‌ను నెలకొల్పేందుకు వేగంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. 190 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ పరిశ్రమ నేడు కేవలం ఆ కంపెనీ యజమానికి మాత్రమే ఉపాధి కల్పిస్తోంది. ప్రతి నెలా దాదాపు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల మేర ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఆ కంపెనీ యజమాని పరిశ్రమ కోసం కేటాయించిన స్థలంలో ఇతర వ్యక్తులకు సైతం సబ్‌ లీజుకు

స్థలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్దంగా.. : ఒక పరిశ్రమకు ఏ మార్కెట్‌ ధరకు స్థలాన్ని కేటాయించారో అందులో 15శాతం డబ్బు ముందుగా చెల్లించి సేల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత రెండేళ్లలోపు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలి. ఏ ఉద్దేశంతో పరిశ్రమ స్థాపించారో ఆ మేరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ప్రొడక్షన్‌ ప్రారంభించిన తర్వాత ఏపీఐఐసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిశ్రమను పరిశీలించి మిగిలిన మొత్తం ఏపీఐఐసీ పేరిట డీడీలు తీసిన తర్వాత పరిశ్రమ పేరిట కేటాయిం చిన స్థలానికి సేల్‌డీడ్‌ చేస్తారు. అయితే ‘స్వాతి సన్‌సోర్స్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ యజమాని పరిశ్రమను స్థాపించనేలేదు. అయినా ఏపీఐఐసీ అధికారులు రూ.100కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎలాంటి పర్యవేక్షణ లేకుండా రూ.1.19కోట్లకు 26.04.2018న అప్పనంగా సేల్‌డీడ్‌  చేయడం గమనార్హం.

విచారణ జరిపితేనే..: స్వాతి సన్‌సోర్స్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి భూములు కట్టబెట్టడం వెనుకు అసలు రహస్యం దాగి ఉంది. రెండేళ్లలోపు పరిశ్రమను స్థాపించకపోతే సదురు కంపెనీ పేరిట స్థలాన్ని కేటాయించిన సేల్‌ అగ్రిమెంట్‌ను సైతం క్యాన్సిల్‌(రద్దు) చేసే అధికారం ఏపీఐఐసీకి ఉంది. అయితే 2012 నుంచి నేటి వరకు 6ఏళ్లుగా పరిశ్రమను స్థాపించకపోయినా అధికారులు భూములను సదురు పరిశ్రమకు అప్పన్నంగా ఎలా కట్టిబెట్టారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే యజమాని గుట్టు, అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అసలు కథేంటి?
ఇప్పటి వరకు పరిశ్రమ జాడ లేదు.
కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటు.. పెద్ద భవంతులను  నిర్మించారు.
కియా పరిశ్రమకు చెందిన కొరియన్స్‌కు అద్దెకిచ్చారు.
తాజాగా అదే స్థలంలో  రెస్టారెంట్‌ నిర్మాణం.
నెలవారీగా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మేర ఆదాయం.

పూర్తి స్థాయిలో పరిశీలిస్తా
స్వాతి సన్‌సోర్స్‌ పరిశ్రమను ఏర్పాటు చేయకుండానే భూములు కట్టబెట్టారనే విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో రికార్డులు తెప్పించి  పరిశీలించి అధికారులతో పూర్తిస్తాయి విచారణ జరిపిస్తా.– ఎస్‌.ఢిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌

పరిశీలన తర్వాతే సేల్‌డీడ్‌
స్వాతి సన్‌సోర్స్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని పరిశీలించిన తర్వాతే సేల్‌ డీడీ చేశాం. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు సైతం కొనసాగుతున్నాయి.– నాగేశ్వరరావు, జోనల్‌ మేనేజర్, ఏపీఐఐసీ అనంతపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top