తవ్వేకొద్దీ అవినీతి! | Corruption in The National Rural Employment Guarantee Scheme | Sakshi
Sakshi News home page

తవ్వేకొద్దీ అవినీతి!

Jun 11 2014 2:10 AM | Updated on Sep 22 2018 8:22 PM

తవ్వేకొద్దీ అవినీతి! - Sakshi

తవ్వేకొద్దీ అవినీతి!

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. కోట్లాది రూపాయలతో ముడిపడిన ఈ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి వెలుగు చూస్తోంది.

కర్నూలు(కలెక్టరేట్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. కోట్లాది రూపాయలతో ముడిపడిన ఈ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి వెలుగు చూస్తోంది. ఎవరి స్థాయిలో వారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9,798 మంది ఈ కోవలో ఉన్నారంటే అవినీతి ఏ స్థాయిలో చోటుచేసుకుందో అర్థమవుతోంది. జిల్లాలో 2007 సంవత్సరం నుంచి పథకం అమలవుతుండగా.. ఇప్పటి వరకు రూ.1,650 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.235 కోట్లు వ్యయమైంది. ఇంత చేసినా ఎక్కడా ఆ పనుల జాడ లేకపోవడం గమనార్హం.
 
జిల్లాలో వెలుగుచూసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడా లేని విధంగా సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా రూ.124.9 కోట్ల దుర్వినియోగం వెలుగుచూసింది. పథకంలోని అక్రమాలపై యేటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏడో విడత తనిఖీ కొనసాగుతుండగా.. రూ.756.9 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం 7.50 లక్షల జాబ్ కార్డుల్లో అత్యధికం బోగస్‌వేనని తెలుస్తోంది.
 
చనిపోయిన.. విద్యార్థులు.. ఉద్యోగుల పేర్లతో జాబ్ కార్డులు సృష్టించి కొందరు సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. అక్రమాలపై విచారణ చేపట్టి శిక్షించేందుకు మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మూడేళ్లుగా ప్రచారంలో ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. మొబైల్ కోర్టుల ప్రచారం నేపథ్యంలో అక్రమార్కులను మూడు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మొబైల్ కోర్టుల్లో సత్వరం
 
విచారణ జరిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కోర్టును ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులు మరింత చెలరేగుతున్నారు. సామాజిక తనిఖీల్లో రూ.795 కోట్లు దుర్వినియోగమైనట్లు తేలినా.. అధికారులు కేవలం గ్యాప్‌లు మాత్రమేనంటూ అవినీతి మొత్తాన్ని రూ.8,68,06,259కు కుదించడం గమనార్హం.

ఈ మొత్తంలోనూ రూ.1.79 కోట్లు మాత్రమే రికవరీ చేయడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. అవినీతిలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అగ్రస్థానం అక్రమించారు. అధికారికంగానే టెక్నికల్ అసిస్టెంట్లు రూ.2.18కోట్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.1.41 కోట్లు స్వాహా చేసినట్లు స్పష్టమైంది. వెల్దుర్తి, కృష్ణగిరి, ఎమ్మిగనూరు, పాములపాడు, పత్తికొండ, ప్యాపిలి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు, మద్దికెర తదితర మండలాల్లో నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
అక్రమాలకు కళ్లెం వేయలేని పరిజ్ఞానం:
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్‌ఆర్‌ఈజీఎస్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించినా ఫలితం లేకపోయింది. జాబ్ కార్డు వెరిఫికేషన్ చేపట్టినా తూతూమంత్రంగా సాగింది. జిల్లాలో 2.15 లక్షల బోగస్ జాబ్ కార్డులు ఉన్నట్లు మాత్రమే తేల్చగలిగారు. ఈఎంఎంఎస్, ఈ-మెజర్‌మెంట్ విధానాలను అమల్లోకి తీసుకొచ్చినా.. ఆన్‌లైన్ పేమెంట్ చేపడుతున్నా అక్రమాలను అడ్డుకోలేకపోవడం గమనార్హం.
 
అక్రమాలను తగ్గిస్తున్నాం - హరినాథ్‌రెడ్డి, డ్వామా పీడీ

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో అక్రమాలను తగ్గిస్తున్నాం. పీడీగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజోపకర పనులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. డంపింగ్ యార్డులు, పండ్ల తోటల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించం. ఇప్పటికే బాధ్యులపై చర్యలు మొదలుపెట్టాం. దుర్వినియోగం చేసిన మొత్తాన్ని రికవరీ కూడా చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement