పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో హైఅలర్ట్‌

Coronavirus Andhra Pradesh government Is On high alert - Sakshi

కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులు అంటిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది

పాజిటివ్‌ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్‌

ఇంటింటికీ ర్యాపిడ్‌  సర్వే

హాట్‌స్పాట్‌ల వద్ద మరింత అలర్ట్‌

సాక్షి, అమరావతి : కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్దితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా ఆదేశాలు జారీచేస్తున్నారు. అంతేకాక కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకెళుతున్నారు.
(చదవండి : ఏపీలో మరో 14 కరోనా కేసులు)

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసరాల కొనుగోలుకు సమయం కుదించారు. ఏదైనా అత్యవసర పనులు మినహా మిగిలిన సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఈ నిబంధనలు ధిక్కరిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా వెల్లడైన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు, సోకేందుకు అనుమానం ఉన్న వారిని ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా, కరోనా బాధితులను కలిసి ఉండటం వంటి అంశాలతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించడమో చేస్తున్నారు.

పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతరత్రా  కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్‌ ఉన్నదీ తెలుసుకుంటున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నారు. అనుమానితులు, పాజిటివ్‌ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు  తీసుకుంటున్నారు. సంబంధిత పరిధి వరకు హైపోక్లోరైడ్‌ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మరింత  మెరుగుపరుస్తున్నారు.

కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ప్రభుత్వ చర్యలు
కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన వెంటనే ఏపీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. మర్కజ్‌ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్‌ సస్పెక్ట్‌లను ప్రభుత్వ యంత్రాంగం వేగంగా గుర్తించింది. ఇందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. అంతేకాక గుర్తించిన వారిని శరవేగంతో క్వారంటైన్‌ క్యాంప్‌లకు, ఆసుపత్రులకు తరలించారు. ఆ తర్వాత వెంటనే వారి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఆయా ప్రాంతాలు హట్‌స్పాట్‌లు ప్రకటిస్తున్నారు.ఈ హాట్‌స్పాట్ల వద్ద  మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇలా వెంటనే చర్యలు తీసుకుంటున్న కారణంగానే పాజిటివ్‌ కేసులన్నీ త్వరగా బయటికి వస్తున్నాయి.

వేగంగా జియో ట్యాగింగ్‌
కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎం జగన్‌ ఆదేశాల కనుగుణంగా చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులు, తదితర విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులు  పాజిటివ్‌ కేసులు, ‘మర్కజ్‌’ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్‌ పనులు వేగంగా చేస్తున్నారు. 

హోమ్‌ క్వారంటైన్‌లపై నిఘా..
హోమ్‌ క్వారంటైన్లలో ఉంటున్నవారిపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో కూడిన బృందాలు నిఘా కార్యక్రమాలు  కొనసాగిస్తున్నాయి. హోమ్‌క్వారంటైన్లలో ఉంటున్న వారు నిబంధనల కనుగుణంగా వ్యవహరిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తున్నాయి. ఒక్కో బృందం దాదాపు ఇరవై మంది హోమ్‌ క్వారంటైన్‌లోని వ్యక్తులను పరిశీలిస్తోంది.  కొన్ని ప్రాంతాల్లో హోమ్‌ క్వారంటైన్‌ ఉంటున్నవారు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా జనంలో కలుస్తున్నారని ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో వారిపై ఎప్పటికప్పడు వలంటీర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నిఘా ఉంచుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top