మొన్న పాలవలస శ్రీనివాసరావు, నిన్న దుప్పలపూడి శ్రీనివాసరావు, నేడు పొట్టా చిట్టిబాబు ఇలా రోజుకు ఒకరు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
కోండ్రుకు దెబ్బ మీద దెబ్బ
Mar 19 2014 3:18 AM | Updated on Mar 18 2019 7:55 PM
రాజాం, న్యూస్‌లైన్ : మొన్న పాలవలస శ్రీనివాసరావు, నిన్న దుప్పలపూడి శ్రీనివాసరావు, నేడు పొట్టా చిట్టిబాబు ఇలా రోజుకు ఒకరు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ఏకాకిగా మారుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మందిమాగతులతో.. అధికార లాంచనాలతో వీఐపీ భద్రతతో రాజాం నియోజకవర్గంలో తిరిగిన కోండ్రు నేడు ఒంటరయ్యారు. ఐదేళ్ల పాటు ఆయనకు కుడి భుజంగా వ్యవహరించిన మారేడు బాక మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త దుప్పలపూడి శ్రీనివాసరావు, ఎడమ భుజంగా ఉన్న పాలవలస శ్రీనివాసరావులు రెండురోజుల వ్యవధిలో అనుచర గణంతో పార్టీని వీడి వైఎస్‌ఆర్ సీపీలో చేరడంతో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టు అరుు్యంది.
మొదటి నుంచి కోండ్రును వ్యతిరేకిస్తూ వస్తున్న పీసీసీ సభ్యుడు పొట్టా చిట్టిబాబు వైఎస్‌ఆర్ పార్టీ తీర్ధం తీసుకోవడంతో కోండ్రుకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో పాటు సంతకవిటి మండలంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కైన మాజీ డీసీసీబీ చైర్మన్ వర్గీయులు కూడా వైఎస్‌ఆర్ సీపీలో చేరడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు రేగిడి, వంగర మండలాల్లో పలు పంచాయతీల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు పార్టీ వీడేందుకు సమాయత్తం అయ్యారు. దీంతో ప్రస్తుత రాజకీయాలు మాజీ మంత్రికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేసినప్పటికి అనుచర వర్గం పార్టీని వీడి ఎందుకు వెళ్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరిందని, ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని సన్నిహితులు ఆయన వద్ద ప్రస్తావించడం గమనార్హం. రాజాం మెయిన్ రోడ్డు విస్తరణ, తొమ్మిదేళ్ల పాటు నగర పంచాయతీ కోర్టు కేసులో చిక్కుకున్నా పరిష్కరించక పోవడం, పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు తోటపల్లి నుంచి సాగునీరు సరఫరాలో విఫలం కావడం, సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేయడంతో ప్రజలు మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన వద్ద ప్రస్తావించినా అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
Advertisement
Advertisement