‘హోదా’పై వెనకడుగు

‘హోదా’పై వెనకడుగు - Sakshi


* ఆంధ్రాకు ‘ప్రత్యేకం’పై తగ్గిన కేంద్రం

* బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల డిమాండ్‌తో వెనక్కు తగ్గిన కేంద్రం

* కేవలం చట్టంలో పేర్కొన్న మేరకు ప్రత్యేక పన్ను రాయితీలు

* కేంద్ర వర్తక, వాణిజ్య మంత్రిత్వ శాఖలో కదిలిన ఫైలు


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన ఉత్తుత్తి ప్రకటనగానే మిగిలిపోనుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే తమకు కూడా ఇవ్వాల్సిందిగా అడిగేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేతో పాటు బీహార్ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి.

 

 ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు ఉన్నతస్థాయి వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొ న్న విధంగా ఏపీలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలను ఐదు లేదా పదేళ్ల పాటు కల్పించేందుకు కేంద్ర వర్తక, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫైలును సిద్ధం చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాని పరిస్థితుల్లోనే పరిశ్రమల స్థాపన విషయంలో చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక రాయితీలను కల్పించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఫైలును సిద్ధం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదాపై  కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు తీరని నిరాశే మిగల్చనుంది.

 

  ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటు రూపంలో నిధులు వస్తాయని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చునని ఏపీ ప్రభుత్వం, ప్రజలు భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంగతిని పక్కనపెట్టింది. ప్రస్తుతానికి చట్టంలో పేర్కొన్న విధంగా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి అవసరమైన పన్ను రాయితీలను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వెనుకబడిన ప్రాం తాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సాయం అందించనుంది.  అలాగే రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి తదితర మౌలిక వసతుల నిర్మాణాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండానే చట్టంలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top