కాంగ్రెస్, బీజేపీ రెండూ...మోసపూరిత పార్టీలే | Congress and BJP both a fraudulent parties says B. V. Raghavulu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీ రెండూ...మోసపూరిత పార్టీలే

Dec 9 2013 5:56 AM | Updated on Mar 29 2019 9:18 PM

దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో అవినీతికి అంతులేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు విమర్శించారు.

పాల్వంచ, న్యూస్‌లైన్: దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో అవినీతికి అంతులేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ సమానమేనని అన్నారు. పాల్వంచలో ఆదివారం జరిగిన ‘వర్తమాన రాజకీయాలు- సీపీఎం వైఖరి’ అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం తృతీయ కూటమికే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో  విద్యుత్, నీటి చార్జీలను భారీగా పెరిగాయని, బీజేపీ గెలిచినా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు.
 
 2014 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మూడవ శక్తిగా ఏర్పడుతాయని, ఆ కూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తృతీయ కూటమి కోసం సీపీఎం, మిగితా వామపక్ష పార్టీలు ఎప్పటినుంచో కృషి చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 19 శాతం ఆహార ధరలు పెరిగాయని విమర్శించారు. ఢిల్లీలో ఉల్లిపాయల ధరల పోస్టర్లను చూపి ఓట్లను కొల్లగొట్టారని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏమాత్రం మెరుగు పడలేదని, ఆర్థిక పరిస్థితి పెరగకపోగా 5 శాతం వృద్ధిరేటు తగ్గిందని అన్నారు.రాష్ట్రంలో గత రెండేళ్లుగా జలయజ్ఞం పనులు నిలిచిపోయాయని, దీంతో పంటల ఉత్పత్తి పడిపోయిందని, తద్వారా రైతులతో పాటు పలు పరిశ్రమలకు కూడా నష్టం వాటిల్లుతోందని చెప్పారు.
 
 సమైక్య నినాదంతో నిలబడింది సిపిఎం ఒక్కటే...
  సీపీఎం ఒక్కటే మొదటి నుంచీ సమైక్య నినాదానికి కట్టుబడి ఉందని రాఘవులు చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు అవకాశవాదంతో వ్యవహరించాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంతకాలం మాట్లాడకుండా ఇప్పుడు సమైక్య నినాదం అందుకున్నాడ ని,  ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో చేరుతాడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కలసి ఉంటేనే కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చన్నారు. రెండుప్రాంతాలుగా విడిపోయినా దోచుకునే వారే తప్ప మిగిలిన వర్గాలు ముందుకెళ్లే పరిస్థితి ఉండదని అన్నా రు. ప్రత్యేక, సమైక్య ఉద్యమాలతో రెండు ప్రాంతాలు వెనుకబడిపోయాయని,    పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ బెంగుళూరు, మద్రాస్ వంటి నగరాలకు వెళ్లిపోయాయని చెప్పారు.  
 
 సీఎస్‌ఆర్ పాలసీ అమలులో జెన్‌కో నిర్లక్ష్యం...
 సీఎస్‌ఆర్ పాలసినీ అమలు చేయడంలో జెన్‌కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాఘవులు విమర్శించారు. ఇక్కడి కర్మాగారాలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం లేదని ఆరోపించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. సదస్సులో పార్టీ నాయకులు కాసాని అయిలయ్య, అన్నవరపు సత్యనారాయణ, జ్యోతి, ఇట్టి వెంకటరావు, కొండపల్లి శ్రీధర్, దొడ్డా రవికుమార్, సీఐటీయూ నాయకులు కిరణ్ పాల్గొన్నారు.
 
 ఆదర్శవంతమైన జీవితం గడపాలి
 భద్రాచలం, న్యూస్‌లైన్: నూతన దంపతులు ఆదర్శవంతమైన జీవితం గడపాలని బి.వి. రాఘవులు ఆకాంక్షించారు.భద్రాచలానికి చెందిన సీపీఎం నేత బండారు రవికుమార్ కుమార్తె శాంతిచంద్ర వివాహం ఆదివారం  జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాఘవులు నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి రోజుల్లో వివాహాలు ఆడంబరాలకు చిహ్నాలుగా మారిపోతున్నాయని, వీటికి దూరంగా ఉండాలని అన్నారు. వధూవరులు సంసార జీవితంలో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య, జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, వైఎస్సార్‌సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement