ప్రభుత్వం చిట్టచివరిదిగా పేర్కొంటున్న ఏడో విడత భూ పంపిణీపై గందరగోళం నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చిట్టచివరిదిగా పేర్కొంటున్న ఏడో విడత భూ పంపిణీపై గందరగోళం నెలకొంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భూ పంపిణీని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పాల్గొంటారని సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. భూమిలేని పేదలకు పంపిణీ కోసం 1.30 లక్షల ఎకరాలను గుర్తించినట్లు రెవెన్యూ శాఖ వర్గాలు కూడా ప్రకటించాయి.
కానీ జిల్లాల్లో అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. ఇప్పటివరకు అనేక నియోజకవర్గాల్లో అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలు జరగలేదు. అంటే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తికానట్లే. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్క నియోజకవర్గంలో కూడా ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి కమిటీ సమావేశాలు జరగలేదు. చిత్తూరు జిల్లాలో 5,400 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ కోసం గుర్తించినా ఒక్క నియోజకవర్గంలోనూ కమిటీ సమావేశం జరగకపోవడం గమనార్హం. మెదక్ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో ఒక్క జగిత్యాలలోనే అసైన్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది.
వైఎస్సార్ జిల్లాలోనూ సగం నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు తమకు షెడ్యూలే రాలేదని జిల్లా కలెక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం చేతుల మీదుగా భూ పంపిణీ లాంఛనంగా మాత్రమే ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, భూ పంపిణీపై ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. సీఎం చేతుల మీదుగా శుక్రవారం డి.ఫారం పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారుల జాబితాను అధికారులు రహస్యంగా ఉంచారు. మెదక్ జిల్లా నుంచి 30 మందిని ఎంపిక చేసిన అధికారులు వారి పేర్లు వెల్లడించలేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భూ పంపిణీ కార్యక్రమ వేదిక వద్ద ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.