పరీక్ష ఫీజు ఐటీడీఏ చెల్లించాలంటూ పాడేరు డిగ్రీ కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులు బుధవారం కదం తొక్కారు.
పాడేరు, న్యూస్‌లైన్ : పరీక్ష ఫీజు ఐటీడీఏ చెల్లించాలంటూ పాడేరు డిగ్రీ కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులు బుధవారం కదం తొక్కారు. డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీగా వచ్చి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఆర్వో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా సాగింది. పరీక్ష ఫీజును ఐటీడీఏ చెల్లించాలని, పెంచిన ఫీజులను ఏయూ తగ్గించాలని డిమాండ్ చేశారు.
గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి విద్యార్థి సంఘాల నేతలతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆన్‌లైన్ జరగనందునే ఉపకార వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని, వెంటనే సమగ్ర సమాచారంతో ఆన్‌లైన్ చేసుకోవాలని విద్యార్థి సంఘాలకు డీడీ సూచించారు. అయితే ఫీజు చెల్లించేందుకు గడువు లేకపోవడంతో అడ్వాన్స్ రూపంలోనైనా ఐటీడీఏ చెల్లించాలని విద్యార్థి సంఘాలు కోరాయి.
చివరకు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ విద్యార్థి సంఘాల నేతలు ఎంఎం.శ్రీను, రాధాకృష్ణ, కోడ అజయ్‌కుమార్, జె.రమణ, కె.చిన్నలతో సమస్యలపై చర్చలు జరిపారు. ఫీజుల సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, అరకు ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు ఫీజుల చెల్లింపు గడువు పెంచాలని పీవో స్వయంగా ఏయూ అధికారులతో మాట్లాడారు. పీవో హమీ మేరకు ఆందోళనను విద్యార్థులు తాత్కాలికంగా విరమించారు.