మార్చికి రెండు హైవే కారిడార్లు పూర్తి 

Complete two highway corridors with in March Month - Sakshi

అందుబాటులోకి కత్తిపూడి–ఒంగోలు,విజయవాడ–జగదల్‌పూర్‌ కారిడార్లు 

అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే అలైన్‌మెంట్‌లో మార్పు

ఎక్స్‌ప్రెస్‌ వేను చిలకలూరిపేట వద్ద ఎన్‌హెచ్‌–16కు అనుసంధానం  

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రం మీదుగా వెళ్లే రెండు హైవే కారిడార్లు పూర్తికానున్నాయి. వీటిలో విజయవాడ–జగదల్‌పూర్‌ హైవే (ఎన్‌హెచ్‌–30) దాదాపు పూర్తయింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, తిరువూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా ఈ హైవే వెళుతుంది. 2015లో ప్రారంభమైన ఈ హైవే నిర్మాణంలో భూ సేకరణ ఇబ్బందులు లేకపోవడంతో త్వరితగతిన పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌ భూభాగం పరిధిలో తిరువూరు వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. మొత్తం రెండు ప్యాకేజీలుగా విభజించి రూ.515 కోట్లతో ఈ కారిడార్‌ నిర్మాణం చేపట్టారు.

ఈ హైవేలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కొండపల్లి వద్ద అరకొరగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దాదాపు మొత్తం 98 శాతం పనులు పూర్తి అయ్యాయి. అయితే కోస్తా రాస్తాగా పేరు గాంచిన కత్తిపూడి–ఒంగోలు హైవే (ఎన్‌హెచ్‌–216) పనులు మాత్రం మిగిలిపోయాయి. 2016లోనే ప్రారంభమైన కత్తిపూడి–ఒంగోలు హైవేలో ఒంగోలు వైపు పనులు మాత్రం పూర్తి కాలేదు. మొత్తం తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి రూ.3,800 కోట్లతో పనులు చేపట్టారు.

ఈ హైవేలో ఒక ప్యాకేజీ కింద మాత్రమే పనులు పూర్తి మిగిలిన 8 ప్యాకేజీల కింద పనులు సాగుతున్నాయి. మార్చి ఆఖరు నాటికి పనులు పూర్తి చేసేలా ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కత్తిపూడి–కాకినాడ–దిగమర్రు–మచిలీపట్నం–ఒంగోలు వరకు ఈ జాతీయ రహదారిని నాలుగు, రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రెండు హైవేలు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు తీరడంతో పాటు పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.

అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పు
అనంతపురం నుంచి అమరావతి వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ వే అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పు చేశారు. అనంతపురం నుంచి అమరావతి వరకు 385 కి.మీ. నిర్మించే ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను గుంటూరు జిల్లా తాడికొండ మీదుగా అమరావతి రాజధాని వరకు నిర్మించేందుకు తొలుత ప్రతిపాదించారు. అయితే అనంతపురం నుంచి నేరుగా చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేస్తే 68 కి.మీ. మేర నిర్మాణం తగ్గుతుందన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఏ ప్రాంతంలో అనుసంధానం చేయాలన్న విషయంలో నాలుగు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top