ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు: సీఎం జగన్‌

CM YS Jagan Speech At Diplomatic Outreach Summit In Vijayawada - Sakshi

ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు

మా బలహీనతలు మాకు మీకు తెలుసు

 కానీ మా బలాలు కూడా మీకు చెప్పాలి

సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు మా సొంతం

వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మీ సహకారం కోరుతున్నాం

సాక్షి, విజయవాడ: ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు అవినీతి రహిత పాలన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలనతో ముందుకు వెళుతోందని, అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ఉపన్యాసం చేశారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మాకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందికరమే. మా బలహీనతలు మాకు మీకు తెలుసు. కానీ మా బలాలు కూడా మీకు చెప్పాలి. సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు మా సొంతం. సుస్థిర ప్రభుత్వం మాది. అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తున్నాం. ఇటీవల చట్ట సభలోను చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలను కూడా తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలు మీకు చెప్పదల్చుకున్నా.

మాకు 970 కిలోమీటర్ల కోస్టల్‌ లైన్‌, నాలుగు ఓడ రేవులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది మా బలం. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 86శాతం సీట్లు గెలుచుకున్నాం. పార్లమెంట్‌ సీట్ల పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా మాకున్నాయి. పారదర్శకమైన విధానాలు, అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉన్నాం. అన్ని స్థాయిల్లో విప్లవాత్మకమైన నిర‍్ణయాలు తీసుకున్నాం. 

పెట్టుబడులు పెట్టేవారికి ధైర్యం కల్పించే బాధ్యత మాది. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యుత్‌ డిస్కంల పరిస్థితి దారుణంగా ఉంది. 20వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిస్కంలు సంక్షోభంలో ఉన్నాయి. రెవెన్యూ తక్కువ ఉండి, వ్యయం పెరిగితే డిస్కంలు పనిచేయలేవు. అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై (పీపీఏ) పునఃసమీక్షిస్తున్నాం. ఇది వివాదాస్పదమైన నిర్ణయం అని అంతా అనుకోవచ్చు. కానీ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలి అంటే ఇది తప్పదు. వినియోగదారుల, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరు నష్ట పోకూడదు అన్నదే మా విధానం. ఇవన్నీ మీకు తెలియాలి. అంతిమంగా పరిశ్రమలే ధరలు చెల్లించాలి. అందుకే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాం. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం తప్పదు. మీకు వాస్తవాలు తెలియాలి అలానే మాపై విశ్వసనీయత పెరగాలి.

ఆ బాధ్యత మాదే...
పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించటం అనే మరో నిర్ణయం తీసుకున్నాం. ఇదీ వివాదాస్పద మే. కాలుష్యం ఇచ్చే పరిశ్రమలు అక్కడి స్ధానిక యువత కు ఉపాధి కల్పించకపోతే ఎలా. అమెరికాలో కూడా స్థానిక ఉద్యోగాలపై చర్చ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు లేకపోతే పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఎలా ఇస్తారు. ప్రజలకు నమ్మకం కల్పించాలి. మీరు పెట్టే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం స్థానికంగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో నైపుణ్యం శిక్షణ ఇప్పిస్తాం. పరిశ్రమకు కావాల్సిన అర్హతలు తెలుసుకుని శిక్షణ ఇస్తాం. ఎలాంటి నైపుణ్యం ఉన్నవారు కోరుకుంటుందో...అలాంటి యువతను మేం అందిస్తాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఉంటుంది. స్థానికులకు ఉద్యోగాలు లేకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 

ఇక వనరుల విషయానికి వస్తే బ్లూ ఎకానమీలో మేము పటిష్టంగా ఉన్నాం. 13 జిల్లాలకుగానూ 6 జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అయిదేళ్లలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. ఇక ఆక్వా ఉత్తత్తుల్లో మేమెంతో ముందున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేలా మీ సహకారం కావాలి. ఆక్వా రంగం, వ్యవసాయ రంగాల్లో ఇది అవసరం. ఉత్పత్తిని పెంచే వినూత్న పద్ధతులను అవిష్కరించాలని కోరుకుంటున్నా. కానీ మేము ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి ప్రపంచ స్థాయిలో ఉండటం లేదు. వీటిని ఆ స్థాయికి తీసుకు వచ్చేందుకు మీ సహకారం కావాలి.

అవినీతి రహిత పరిపాలన అందిస్తాం
కాఫీ, ఆక్వా ఉత్పత్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ఎగుమతులు పెరగాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రవాణా రంగాలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. పాఠశాలలు, కళాశాలల్లో ఏపీలో చేరిక శాతం 25 శాతం మాత్రమే ఉంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మీ సహకారాన్ని కోరుతున్నాం. నిజాయితీ గల ప్రభుత్వం అలాగే , పారదర్శక విధానాలు, మంచి బృందం అందుబాటులో ఉంది. ఇక్కడ 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. అందుకే విద్య, వైద్య, వ్యవసాయం కోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నాం. మేం పారదర్శక, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఖచ్చితంగా చెప్తున్నా.

మీ సహకారం కోరుతున్నాం
పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. నదుల అనుసంధానానికి కట్టుబడి ఉన్నాం. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానానికి సహకారం కావాలి. డీజిల్‌ బస్సులను తీసేసి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడతాం. విశాఖపట్నంకు మెట్రో రాబోతుంది. విజయవాడ, గుంటూరుకు కూడా మెట్రో వస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని తీర్పును ప్రజలు మాకు ఇచ్చారు. మాపై ప్రజల్లో భారీ నమ్మకాలు ఉన్నాయి. భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. పెట్టుబడులకు మీ సహకారం కావాలి. ఢిల్లీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది దౌత్యవేత్తలు సమావేశం కావటం ఇదే తొలిసారి అనుకుంటున్నా. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top