సువర్ణ పాలన 

CM YS Jagan Mohan Reddy Golden Rule - Sakshi

ఆరు నెలల్లో  అన్ని వర్గాలకూ మేలు  

నవశకం వైపు చకచకా అడుగులు 

ప్రతి అర్హునికీ సంక్షేమ పథకాలు 

అందేలా ఇంటింటా సర్వే 

ఇచ్చిన హామీలనే కాక కోరకుండానే వరాలు కురిపిస్తున్న జగన్‌మోహనుడు

శ్రీకాకుళం/ శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఆరు నెలల పాలనలో రాష్ట్రాన్ని నవశకం వైపు పయనించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారమే కాకుండా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ నవశకం పేరిట ఇంటింట సర్వేలు జరిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని వలన ప్రజలు గతంలోలా జిల్లా, మండల కేంద్రాలకు  వెళ్లాల్సిన పని ఉండదు. వారి గ్రామంలో ఉన్న సచివాలయానికి వెళ్లి సమస్యను తెలియజేస్తే 72 గంటల్లో దానిని పరిష్కరిస్తారు.

మద్యపాన నిషేధం... 
మద్యపాన నిషేధం నిర్ణయంతో మహిళల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో తొలి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలను తొలగిం చడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 191 దుకాణాలు నడుస్తున్నాయి. అంతకుముందు 237 దుకాణాలు ఉండేవి. కొద్దిరోజుల క్రితమే బార్లలో 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 19 బార్లు ఉండగా వీటిలో 8 బార్ల వరకు మూతపడే పరిస్థితి ఉంది. దీనికితోడు మద్యం ధరలను పెంచడంతో చాలా మంది మద్యం అలవాటును మానుకుని ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉన్నారు.

ఉద్యోగాల విప్లవం.. 
జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్లను, పలువురు ఉద్యోగులను నియమించారు. జిల్లాలో 1100 పంచాయతీలు, ఒక నగరపాలకసంస్థ, మూడు మునిసిపాలిటీలు ఉండగా వీటి పరిధిలో ఇప్పటివరకు 9,500 మందికి పైగా ఉద్యోగాలు పొందారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

పింఛన్ల పెంపుతో ఆసరా..
వైఎస్సార్‌ భరోసా క్రింద వృద్ధులు, వికలాంగులు దీర్ఘకాలిక రోగులు, వితంతువులు తదితర వర్గాలకు పింఛన్‌ పెంపు దశల వారీగా చేసే కార్యక్రమంలో ప్రస్తుతం తొలి విడతగా రూ.2,250కు పెంచారు. వికలాంగులకు రూ.3,000, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, డప్పు కళాకారులకు రూ.3 వేలు వంతున పెంచారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్‌లు కలిపి 3,42,948 మంది ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. వీరి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా వలంటీర్ల ద్వారా నేరుగా ధరఖాస్తు చేసుకున్నవారు మరో 34,085 మంది ఉన్నారు. వీరికి కూడా ఈ పింఛన్‌ను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇంటింటికీ నాణ్యమైన బియ్యం..
జిల్లాలో ప్రస్తుతం తెలుపురంగు రేషన్‌కార్డులు 8,32,636 ఉన్నాయి. వీటికి గాను నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేసేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా ప్రతి నెలా 13,243 మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అలాగే కొత్తగా జిల్లాలో 12 వేల మంది కార్డుల కోసం వివిధ రకాలుగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే నవశకంలో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటా సర్వే నిర్వహించి కొత్తగా బియ్యం కార్డుకు అర్హులను ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కొత్తగా వారికి జనవరి నాటికి బియ్యం కార్డును అందజేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవడం జరిగింది.  

జగనన్న విద్యావసతి.. 
జగనన్న విద్యావసతి ద్వారా ఇప్పటికే జిల్లాలో సుమారుగా 76,200 మంది విద్యార్థులు వసతి, ఉచిత విద్యను పొందుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలతోపాటు కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లలో ఈ విద్యార్థులు ఉన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో మరింతమంది విద్యార్థులు ఈ ప్రయోజనం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా మరో 10 వేల మంది విద్యార్థులకు జగన్న విద్యావసతి అందుబాటులోకి రానుంది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా.. 
అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన రూ.10 వేల లోపు ఖాతాదారులకు ఆ మొత్తాన్ని వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసి వారి కన్నీళ్లను తుడిచింది. జిల్లాలో ఇలాంటి వారు 48,08,033మంది ఉండగా రూ.36.90 కోట్లు అందజేశారు. మరికొద్ది నెలల్లో రూ.20 వేల లోపు ఖాతాదారుల జాబితాను సేకరించి వారికి కూడా నగదును జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.  

మద్యనిషేధం మా బతుకుల్లో వెలుగు నింపింది.. 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యనిషేధం మా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. గతంలో ఊరూరా బెల్టుషాపులు ఉండడంతో నా భర్త రోజంతా తాపీ మేస్త్రీగా పనిచేసి సంపాదించిన మొత్తాన్ని తాగుడుకు ఖర్చు చేసేవాడు. దీంతో కుటుంబంలో గొడవలతోపాటు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం ఊళ్లో బెల్టుషాపులు మూసేయడంతో మద్యం అందుబాటులో లేక నా భర్తకు ఆ చెడు అలవాటు తగ్గింది. దూరప్రాంతానికి వెళ్లి అధిక ధర చెల్లించాల్సి రావడంతో తాగాలనే కోరిక సన్నగిల్లింది. మాలాంటి పేద కుటుంబాలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేసింది.
–మానేకం కోకిల, ముత్యాలపేట, కవిటి మండలం

విద్యారంగానికి పెద్ద పీట...
విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది అమ్మఒడి. 1 నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే విద్యార్థులకు ఏటా రూ.15 వేలను వారి తల్లి ఖాతాలో జమ చేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల సంఖ్య పెరిగేలా, డ్రాప్‌అవుట్‌ తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పిల్లలను చదువుకు పంపిన తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఆ బరువు మోసేందుకు సిద్ధమయింది. ఈ పథకాన్ని జనవరి 9న ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఈ పథకం క్రింద జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో చదువుఉన్న విద్యార్థులు సుమారుగా 3,12,145 మందికి ప్రయోజం చేకూరుతోంది.  
 
వైఎస్సార్‌ రైతు భరోసా..
రైతులకు వ్యవసాయ పనులలో సాయపడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతుభరోసా. అర్హులైన రైతులకు ఏడాదిలో మూడు విడతల్లో రూ.13,500 అందజేసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. తొలి విడతగా జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు గాను తొలివిడతలో 7,500 వంతున ఇప్పటికే రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో ఆ నగదును జమ చేయడం జరిగింది. సుమారుగా జిల్లాలో రైతుల కోసం 5,510 కోట్లను సిద్ధం చేసింది. దీంట్లో కౌలు రైతులు అటవీ భూముల సాగుదారులు, ఈనాం భూములు ఉన్నవారికి కూడా రైతు భరోసాను క    ల్పించి ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. 

ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ..
జిల్లాలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల్లో ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గతంలో ఐదేళ్లపాటు ఈ పథకం నీరసించింది. వైఎస్సార్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మరిన్ని వ్యాధులను ఈ పథకంలో చేర్పించారు. రూ.వెయ్యి దాటిన ప్రతి వైద్య ఖర్చులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడంతో జిల్లాలో 8 లక్షల కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా వచ్చిన మార్గదర్శకాలతో ఈ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సంఖ్య మరో 70 వేల వరకూ పెరగనుందని అంచనాలు వస్తున్నాయి. 

విద్యార్థులకు ‘వెలుగు’ 
విద్యార్థులకు పాఠశాలల్లోనూ, వసతి గృహాల్లో నూ రుచికరమైన, పౌష్టికాహారం అందించేలా మధ్యాహ్న భోజనాన్ని రూపకల్పన చేస్తూ ధరలను కూడా పెంచారు. గతంలో అందజేస్తు న్న బియ్యం స్థానంలో నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తున్నారు. మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే కార్మికుల వేతనాలను కూడా పెంచారు. పాఠశాల నాడు–నేడు పేరిట కార్యక్రమాన్ని అమలు చేస్తూ అధునాతన సౌకర్యాలతో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించి అందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నారు. 500 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 46 పాఠశాలలు అప్‌గ్రేడ్‌ అయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వారానికోసారి నో బ్యాగ్‌డేను అమలు చేస్తున్నారు. రోజులో నాలుగుసార్లు మంచినీరు తాగేందుకు సమయాన్ని కేటాయింపజేస్తున్నారు. కంటి పరీక్షలు జరిపి వారిలో వెలుగు నింపేందుకుగాను వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇప్పటికే 80 శాతం పూర్తి చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top