కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Holds Review Meeting On Covid 19 Preventive Measures - Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలన్నారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా... కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను అభినందించారు. మరింత విస్త్రృతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అదే సమయంలో ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా.. డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయాలని సూచించారు.(గుజరాత్‌ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం జగన్‌)

అదే విధంగా కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇక పంట చేతికొచ్చిన తరుణంలో గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా పంటల పరిస్థితులు.. ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చని తెలిపారు. రూ.100కే వివిధ రకాల పండ్లు ఇవ్వటాన్ని కొనసాగించాలన్నారు. ఈ విధానం శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.(ఏపీని అన్ని రాష్ట్రాలు అభినందిస్తున్నాయి..)

తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ
గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో బొల్లా వీరాంజనేయలు, రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంట పొలంలో వదిలేశారంటూ వచ్చిన కథనంతోపాటు.. కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతు బజార్లకు చేరక కుళ్లిపోతున్నాయంటూ ప్రచురించిన కథనాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండూ తప్పుడు సమాచారంతో కూడినవేనని అధికారులు నివేదించారు. కర్బూజా పంట పండించిన రైతు కుటుంబంతో మాట్లాడామని.. రెండు కోతలు కోసి పంటను ఇప్పటికే తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని.. మూడో కోతలో నాసిరకం కాయల కారణంగా వదిలేశామని చెప్పినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు ఆ కుటుంబం చెప్పిందని వెల్లడించారు. ఇక విజయవాడలో అరటిగెలలు కూడా కడప నుంచి తెప్పించి, స్థానిక మార్కెట్లకు పంపించామని, అంతేతప్ప వాటిని వదిలేయలేదని అధికారులు స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top