సీఎం పదేపదే అదే చెప్పారు: టీటీడీ ఈవో

CM Told Us Not To Hurt Devotees Sentiments Says TTD EO Singhal - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల మాయం వ్యవహారం, అర్చకుల మధ్య విబేధాలు తదితర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టీటీడీ ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో భేటీ అనంతరం టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. వివాదాలకు సంబంధించి సీఎం ఏం చెప్పారో వివరించారు..
(చదవండి: లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా)

సీఎం గట్టిగా చెప్పారు: ‘‘టీటీడీలో అన్ని పనులూ చట్టప్రకారం, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుగుతున్నాయి. నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పగలుగుతున్నాం. ఇకపోతే సమావేశంలో సీఎంగారు మాకు పదేపదే ఒకే విషయాన్నిగుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతకు ఎక్కడా భంగం వాటిల్లకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలని చెప్పారు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దని ఆదేశించారు. ఆయా రోజులకు సంబంధించి స్వామివారి కైంకర్యాల వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మేం సీఎంకు వివరించాం’’ అని సింఘాల్‌ తెలిపారు.

ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ప్రదర్శిస్తాం: 1952 నుంచి శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని టీటీడీ ఈవో చెప్పారు. ‘‘2011 జనవరి 20న టీటీడీ వేసిన రిటైర్డ్ జడ్జీల కమిటీ కూడా ఆభరణాలన్నీ ఉన్నాయని తేల్చింది. కానీ శ్రీకృష్ణ దేవరాయల ఆభరణాలు యేవో ఆ కమిటీ తేల్చలేకపోయింది. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతూనే ఉంటుంది. ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా రికార్డుల్లోకి వస్తాయి. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చాం. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రచారంలో ఉన్నట్లు గులాబీ వజ్రం ఏదీ లేదు. రూబీ మాత్రమే ఉంది. అదికూడా భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిపోయింది’’ అని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వివరించారు. కాగా, సీఎంతో భేటీకి ముందు ఈవో మీడియాకు ఏం చెప్పారో, సమావేశం తర్వాత కూడా అదే చెప్పడం గమనార్హం. తద్వారా శ్రీవారి నగల మాయంపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎలాంటి చర్యలుగానీ, విచారణగానీ చేపట్టబోవడంలేదని తెలుస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top