ఆగ్రహం వద్దు: చంద్రబాబు

cm chandrababu says to mps, ministers don't speak again on union budget - Sakshi

బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని మాత్రమే చెప్పండి

రాజీనామాలు, బహిష్కరణలపై ప్రకటనలు వద్దు

ఎంపీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేయాలే తప్ప తొందరపాటు ప్రకటనలు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలు, మంత్రులకు నిర్దేశించారు. బడ్జెట్‌ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని, భాగస్వామ్య పక్షంగా టీడీపీకి ఇది తీవ్రమైన అంశమని, అయినప్పటికీ వెంటనే ఓ నిర్ణయానికి రాలేమని, ఆచితూచి స్పందించాల్సి ఉందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై గురువారం చంద్రబాబు టీడీపీ ఎంపీలు, మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తొలుత ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేలో కొనసాగడం మంచిది కాదని పలువురు ఎంపీలు చెప్పగా.. తామంతా రాజీనామాలు చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ అన్నట్టు సమాచారం.

రాజీనామాలకంటే ఈ బడ్జెట్‌ సమావేశాల్ని బహిష్కరించడం ద్వారా నిరసన తెలిపితే బాగుంటుందని మరికొందరు ఎంపీలు అభిప్రాయపడగా, కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని ఒకరిద్దరు సూచించారు. అందరి మాటలు విన్న చంద్రబాబు ఆవేశపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని, ఎంపీలు తొందరపాటుగా ఎక్కడా మాట్లాడవద్దని సూచించారు. ఆదివారం జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించాక ఓ నిర్ణయానికి వద్దామని, అప్పటివరకు ఆచితూచి స్పందించాలన్నారు.

కేంద్రమంత్రి సుజనాచౌదరితో ఆయన విడిగా మాట్లాడి ఢిల్లీ పరిణామాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై బడ్జెట్‌పై ఎలా మాట్లాడాలనే దానిపై సూచనలు చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోకున్నా ఎన్డీయేను టీడీపీ వదలట్లేదనే భావన ప్రజల్లో ఉందని, ఇలాంటి సమయంలో ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఇబ్బంది వస్తుందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. సీఎం స్పందిస్తూ.. కేంద్రంపై ఒత్తిడి చేయడమే మన ముందున్న మార్గమని, అంతకుమించి ఎక్కువ చేయొద్దని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చెప్పాలని, నేరుగా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేయొద్దని సూచించారు.

శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిద్దామని, కేంద్రమంత్రులను కలవడమా? నిరసన తెలపడమా? ఇంకా గట్టిగా ఒత్తిడి తేవడమా? అనే విషయాన్ని రెండురోజుల్లో నిర్ణయిద్దామని చెప్పారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.  బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోతామని, దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top