పదవి కాంక్షతో అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు ఎన్నికల ముందు మోసపూరితమైన హామీలు గుప్పించారని
టెక్కలి : పదవి కాంక్షతో అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు ఎన్నికల ముందు మోసపూరితమైన హామీలు గుప్పించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. అధికారం వచ్చిన తరువాత ప్రజల్ని దగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రస్థాయి పదవిని చేపట్టిన తరువాత మంగళవారం టెక్కలి వచ్చిన ఆయన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ పరిధిలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలు ఇవ్వని ఏకైక రాజకీయవేత్త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.
అయితే కేవలం అధికార దాహంతో సాధ్యం కాని హామీలను ఇచ్చి ఇప్పుడు ప్రజలను దగా చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా యువతకు తీరని మోసం చేశారన్నారు. ఈ విషయంపై యువకులు ఆలోచన చేయాలన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇంటింటా ఉద్యోగమని, రుణాల మాఫీ అని చంద్రబాబు ప్రకటించి ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చకుండా తన కొడుకును ప్రభుత్వ సొమ్ముతో విదేశాలకు పంపించడం ఎంత వరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కురమాన బాలకృష్ణ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు దువ్వాడ వాణి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ప్రతినిధి తిర్లంగి జానకిరామయ్య పార్టీ నాయకులు బెండి గౌరీపతి పాల్గొన్నారు.