నేను వెళ్తున్న దారి కరెక్ట్‌ కాదు.. లక్షలు సంపాదించా

Chittoor District Young Man Ask Permission for Sale his Organs - Sakshi

పేకాటతో జీవితం నాశనమైపోయిందని ఆవేదన

అవయవాల విక్రయానికి అనుమతివ్వాలని యువకుడి వినతి

తల్లిదండ్రులతో మాట్లాడతానన్న సబ్‌కలెక్టర్‌

సాక్షి, మదనపల్లె (చిత్తూరు జిల్లా): ‘నేను వెళ్తున్న దారి మంచిది కాదు. గతంలో పది మందిని మోసం చేసి లక్షలు సంపాదించా.. ఇక ఎవర్నీ మోసం చేయదల్చుకోలేదు. పేకాటలో ఎంత డబ్బు సంపాదించినా విలువ ఉండటంలేదు. అదొక వ్యసనంగా మారిపోయింది. ఇక ఈ జీవితాన్ని కొనసాగించదల్చుకోలేదు. దయచేసి అవయవాలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి’.. అంటూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటకు చెందిన బావాజి (24) స్పందన కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరిని అభ్యర్థించాడు. ఆ వివరాలు..

కురబలకోటకు చెందిన కొమద్ది రహంతుల్లా కుమారుడు బావాజి పదేళ్ల వయస్సులోనే పేకాటకు బానిసయ్యాడు. పేకముక్కల్లో ఏ నెంబరైనా ఇట్టే చెప్పగల ప్రావీణ్యం సాధించాడు. ఎంతగా అంటే.. ఒక్కో పేకముక్క అంకెను, అక్షరాన్ని చూడకుండా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. డబ్బు సంపాదించాలంటే పదిమందిని మోసం చేయాలని.. కానీ, ఇలాంటి బతుకు ఇక వద్దని నిర్ణయించుకున్నట్లు ‘స్పందన’లో సబ్‌కలెక్టర్‌కు చెప్పాడు. పేకాటలో కోట్ల రూపాయలు సంపాదించానని, ఎందరికో లక్షల రూపాయల ఆదాయం చేకూర్చానని చెప్పాడు. ఇక మోసం చేయడం ఇష్టంలేక అవయవాలు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. పేకాట డబ్బులతోనే ఒక చెల్లెలికి పెళ్లి చేశానని, ఇంకా ఇద్దరికి పెళ్లి చేయాల్సి ఉందని, అవయవాల అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో వాళ్లకు పెళ్లి జరిపిస్తానన్నాడు. దీంతో అతని తల్లిదండ్రులను తీసుకురావల్సిందిగా సబ్‌ కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలిచ్చారు.

అనంతరం అర్జీదారుడి ఫిర్యాదుపై సబ్‌కలెక్టర్‌ స్పందిస్తూ.. బావాజి మానసిక స్థితిపై పూర్తిస్థాయిలో విచారించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, మధ్యాహ్నం బావాజి తండ్రి రహంతుల్లా సబ్‌ కలెక్టరేట్‌కు చేరుకుని తన కొడుకు చాలా తెలివైన వాడని, డబ్బు సంపాదించినది వాస్తవమేనని, ఇప్పుడు అంతా పోగొట్టేశాడని చెప్పుకొచ్చాడు. అవయవాలు అమ్ముకునేందుకు అనుమతి అడిగాడని చెబితే అదేమీ లేదు.. కొడుకును తీసుకెళ్తానని సబ్‌ కలెక్టర్‌కు చెప్పాడు. దీంతో బావాజీకి నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిద్దామని సబ్‌కలెక్టర్‌ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top