పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులపై ఫిర్యాదులు అందాయి : సునీల్‌ అరోరా

Chief Election Commissioner Sunil Arora Meet Party Leaders In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. వాళ్లు కొన్ని అభ్యంతరాలు చెప్పారన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని.. ఒక్కరికే రెండు, మూడు ఓట్లున్నాయన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చారని సీఈసీ చెప్పారు. కొన్ని పార్టీలు రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు.

మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వాటిపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని చెప్పారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు సునీల్ అరోరా అన్నారు. ఎన్నికల దృష్టిలోనే కొన్ని బదిలీలు జరిగాయని ఫిర్యాదులు అందాయన్నారు. ఈ విషయంపై సీఎస్‌, డీజీపీలతో చర్చించామని, వాళ్లు సర్టిఫికెట్‌ ఇచ్చాక వాటిపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. (పార్టీలకు అనుబంధ సంఘంగా పనిచేయొద్దు)

ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదు
ఈవీఎంలు దుర్వినియోగం అయినట్టుగా ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని సీఈసీ సునీల్‌ అరోరా అన్నారు. ప్రస్తుత డీజీపీపై లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేదని.. వస్తే పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరగడం అసాధ్యమని చెప్పారు. దాదాపు అన్ని పార్టీలు ఈవీఎంలపై సంతృప్తి వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు.  ఆర్టీజీస్ ద్వారా జరిగిన సర్వే అంశాన్ని ఏపీ ఎన్నికల అధికారి పరిశీలించి విచారణ చేస్తారని ఆయన చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top