
సాక్షి, కర్నూలు: పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి. సత్యం యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని పార్టీ జిల్లా కార్యాయంలో ఆదివారం ఏర్పాటు చేసిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మహానేత అనుక్షణం తపించారన్నారు. ప్రాజెక్టు పూర్తయితేనే తెలుగు నేల పచ్చదనంతో కళకళలాడుతుందని విశ్వసించారన్నారు. సీఎం అయిన తర్వాత పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలోని కరువును తరిమికొడతానని ప్రతినబూనినట్లు వెల్లడించారు.
ఇందుకు అవసరమైన సైట్ క్లియరెన్స్, పర్యావరణ, ఇతర అనుమతులు, భూసేకరణ పూర్తి చేయించారన్నారు. జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జల సంఘానికి కూడా ఆయన వినతిపత్రం సమర్పించారన్నారు. ఆయన జీవించి ఉంటే ఇది వరకే కల సాకారమయ్యేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పునాదుల నిండా అవినీతి నింపారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం ఐదేళ్లుగా కాలయాపన చేశారన్నారు. సమావేశంలో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ధనుంజయాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ యాదవ్, రాష్ట్ర మహిళ కార్యదర్శి శౌరి విజయకుమారి, ఎస్‌సీ సెల్ కార్యదర్శి సుచరిత, నగర నాయకులు చెన్నప్ప, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.