ఛూమంత్ర'కార్‌'

Chandrababu Naidu Cheat BCs With Aadharana Scheme - Sakshi

బీసీలను మోసం చేసేందుకు ప్రభుత్వ యత్నం

తెరపైకి వాహనాల కొనుగోలు పథకం

సబ్సిడీ కేవలం రూ.లక్ష అని ప్రకటన

పథకం అమలుపై అనేక సందేహాలు

ఇన్నోవా మిడిల్‌ వర్షన్‌ మోడల్‌ కారు మార్కెట్‌లో రూ.17 లక్షలు ధర పలుకుతోంది. ఈ కారును ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ.5.95 లక్షల కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో (35 శాతం) అందిస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ రకమైన 40 ఇన్నోవా కార్లను, 17 సిప్ట్‌ డిజైర్‌ కార్లను ఇంతే సబ్సిడీతో అందించారు.  

కర్నూలు(అర్బన్‌): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఓ వైపు చెబుతున్న ప్రభుత్వం .. ఆయా వర్గాలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల సబ్సిడీలో భారీ వ్యత్యాసాన్ని చూçపుతోందని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుదన్ను అని చెబుతున్న ప్రభుత్వం బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్టీఎఫ్‌డీసీ పథకాల ద్వారా 35 శాతం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో వారు కోరుకున్న వాహనాలను (ఇన్నోవా, సిఫ్ట్‌ డిజైర్‌ తదితర) అందిస్తుండగా, బీసీలకు మాత్రం ఏ వాహనం తీసుకున్నా ... కేవలం రూ. లక్ష సబ్సిడీని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణమని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. సాధారణంగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.2 లక్షల యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంపికైతే రూ. లక్ష సబ్సిడీ విడుదల అవుతోంది కదా? ప్రభుత్వం కొత్తగా వాహనాలకు సబ్సిడీ ఇచ్చేది ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విధంగా బీసీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీని అందించాలని వారు కోరుతున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఆయా వాహనాల కొనుగోలుకు బ్యాంకులు రుణంగా అందించడం లేదని, ఆయా కార్పొరేషన్లే రుణంగా అందిస్తున్నాయి. బీసీలకు మాత్రం వాహనాల కొనుగోలుకు బ్యాంకులతో ముడిపెట్టడం వల్ల ఈ పథకం ముందుకు సాగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆదరణ ద్వారా అందింది అంతంతే ...
బీసీ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఆధునిక పనిముట్లను అందిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు గడచిపోయినా, నేటికి 60 శాతానికి పైబడి పనిముట్లు అందని పరిస్థితి నెలకొనింది. ఆదరణ పథకం ద్వారా జిల్లాలోని 36,775 మంది ఆధునిక పనిముట్లు అందించాలని లక్ష్యం కాగా, 76,796 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులుగా 50,587 గుర్తించగా, 28,873 మంది వారికి కావాల్సిన పరికరాలను ఎంపిక చేసుకున్నారు. వీరిలో 10 శాతం మంది (18,969 మంది) లబ్ధిదారులు తమ వాటాగా డీడీలను చెల్లించగా, ఇప్పటి వరకు 7,328 మందికి మాత్రమే వివిధ రకాల పనిముట్లను అందించారు.  

వాహనాలకు లక్ష సబ్సిడీ ఇస్తామన్నారు:బీసీ కార్పొరేషన్‌ ద్వారా వాహనాల కోసం బీసీలు దరఖాస్తు చేసుకుంటే రూ. లక్ష సబ్సిడీగా విడుదల చేస్తామని ఉన్నతాధికారులు తెలియజేశారు. నియోజకవర్గానికి ఒకటి ప్రకారం వాహనాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే లబ్ధిదారులు ముందుకు వస్తే జిల్లాకు 20 వాహనాలు కూడా అందిస్తాం. ఏ వాహనానికైనా ప్రభుత్వం సబ్సిడీ రూ.లక్ష మాత్రమే ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లబ్ధిదారులే స్వయంగా రుణంగా పొందాల్సి ఉంటుంది. వాహనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ సర్వర్‌ ఓపెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇన్‌చార్జీ ఈడీ, బీసీ కార్పొరేషన్‌
 
బీసీలను మోసం చేసేందుకే:తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా వాహనాలను తీసుకుంటున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీని అందిస్తుంటే, బీసీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష సబ్సిడీ ఇస్తామని ప్రకటించడం దారుణం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీల ఓట్లను మరోసారి కొల్లగొట్టేందుకు ఖరీదైన కార్లను సబ్సిడీగా అందిస్తున్నామని ప్రచారం చేసుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. రూ. లక్ష సబ్సిడీ ఇస్తే మిగిలిన మొత్తాన్ని ఏ బ్యాంకులు బీసీలను నమ్మి రుణంగా అందజేస్తాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
జే లక్ష్మినరసింహ, బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top