
నేనే కాదు, చంద్రబాబూ అసంతృప్తిగానే ఉన్నారు
వంద రోజుల పాలనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.
హైదరాబాద్ : వంద రోజుల పాలనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తానే కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అసంతృప్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నామని బొజ్జల తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. అటు ప్రజలకు, ఇటు పార్టీ కేడర్‌కు నిరాశ కలిగించింది. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త మాట చెబుతూ ఇంకా ప్రజలను నమ్మించే యత్నంలోనే ఉన్నారు.
ఇదే చివరి ఎన్నిక...ఇప్పుడు అధికారంలోకి రాకపోతే పార్టీయే ఉండద’ని కేడర్‌ను రెచ్చగొట్టి సీఎం అయిన తరువాత వారికి ఉపయోగపడే నిర్ణయం ఒక్కటీ తీసుకోలేదు. ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా పనులు కావడం లేదనే బాధను ఆ పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది జూన్ ఎనిమిదవ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గ్రౌండ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ఐదు సంతకాల్లో ఒక్క దానిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.