దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురిపై కేసు నమోదు

Case Has Been Registered Against Three Men From Dubai For Corona Effect - Sakshi

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కరోనా వైరస్‌ ప్రబలకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా నగరంలో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులపై ఇనగుదురుపేట పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ అఖిల్‌జమ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ నెల 9వ తేదీన మచిలీపట్నం వచ్చారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో 14 రోజుల పాటు గృహంలోనే ఉండాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ జన సంచారం ఉండే ప్రాంతాల్లో ముగ్గురు తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గృహ నిర్బంధం చేసినట్లు సీఐ తెలిపారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం)

ఎన్‌ఆర్‌ఐపై..
హౌస్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిన ఓ ఎన్‌ఆర్‌ఐ రోడ్లపై సంచరిస్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇంటిలో ఉంచి స్టేషన్‌ సిబ్బందిని కాపలా పెట్టారు. రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మీనరసింహమూర్తి తెలిపిన వివరాలు.. బందరు మండలం నెలకుర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పదిహేను రోజుల క్రితం యూఎస్‌ నుంచి సొంత గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు అతడిని హౌస్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. సదరు వ్యక్తి గ్రామంలో తిరుగుతున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనలో ఉన్న గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వెళ్లి హౌస్‌ ఐసోలేషన్‌లో ఉంచి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. (షాదీ.. 'కరోనా')

కల్లుగీత కారి్మకుడిపై..
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మందుబాబులకు కల్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై బందరు రూరల్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మూర్తి తెలిపిన వివరాలు.. బందరు మండలం గుండుపాలేనికి చెందిన రాజు గ్రామంలో కల్లు గీస్తుంటాడు. సోమవారం కల్లు గీసి గ్రామస్తులకు విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. (కరోనాకు 35,349 మంది బలి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top