మా ఆటకు రండి.. | Cards Clubs | Sakshi
Sakshi News home page

మా ఆటకు రండి..

Oct 25 2018 12:05 PM | Updated on Oct 25 2018 12:05 PM

Cards Clubs  - Sakshi

పాతపల్లి – వెన్నపూసపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వంక ప్రాంతంలో సాగుతున్న పేకాట

‘ఫలానా తోటల సందులో గురువారం పేకాట శిబిరం నిర్వహిస్తున్నాం. మా ఆటకు రండి. మా ఆటకు వస్తే పోలీసులకు భయపడాల్సిన పనిలేదు. వచ్చి పందెం కట్టండి.. నోట్ల కట్టలతో వెళ్లండి. అన్నింటికీ మేమే పూచి’ అంటూ వినూత్నంగా పేకాట శిబిరాల నిర్వాహకులు ఫోన్‌ ద్వారా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇదే మంచి తరుణమంటూ పేకాట ప్రియులు నాలుగు ముక్కలాటకు జై కొడుతూ శిబిరాల వైపు పరుగు తీస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాస్తా పేకాటలో పోగొట్టుకుని వెళ్తున్నారు. నిర్వాహకులు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

అనంతపురం, యల్లనూరు: యల్లనూరు మండల పరిధిలోని పాతపల్లి, కూచివారిపల్లి గ్రామాలు పేకాట స్థావరాలుగా మారాయి. ఈ స్థావరాలకు మండలంలోని పేకాట రాయుళ్లే కాకుండా పుట్లూరు, నార్పల, తాడిమర్రి, మండలాల వారితో పాటు ఎక్కువగా వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వారు రోజూ భారీ సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులకు తాడిపత్రి ప్రాంతానికి చెందిన కొంత మంది బడా నేతల అండదండలు ఉన్నాయి.  

పాతపల్లి కేంద్రంగా..
పాతపల్లికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త గ్రామ పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. పాతపల్లి నుంచి వెన్నపూసపల్లికి వెళ్లే దారి మధ్యలో ఉన్న వంక పరివాహక ప్రాంతంలో, పాలపల్లి, జంగంపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లావంక ప్రాంతంలో,  వెన్నపూసపల్లి గ్రామ దగ్గర పొలాల మధ్య ఉన్న కాలువ దగ్గర పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఈ ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పేకాట రాయుళ్లకు నిర్వాహకుడు తెలియజేస్తాడు. దీంతో ప్రతి రోజూ సుమారుగా 60 నుంచి 80 మంది దాకా పేకాట రాయుళ్లు వస్తారు. దాదాపు రూ.50 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. పేకాట రాయుళ్ల వద్ద నుంచి నిర్వాహకుడు రోజుకు రూ. 60 వేల నుంచి రూ.80 వేల వరకు మేజు రూపంలో వసూలు చేస్తున్నారు.

కూచివారిపల్లి పరిసర ప్రాంతాల్లో..
కూచివారిపల్లికి చెందిన ఓ టీడీపీ నేత మొన్నటి వరకు ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహించాడు. ప్రస్తుతం స్థావరాన్ని గ్రామ సమీపంలోని కొండలో ఉన్న తుమ్మలోని వంక దగ్గర, అలాగే కొండ సమీపంలో ఉన్న గంగమ్మతల్లి ఆలయ పరిసర ప్రాంతాల్లోను, పుట్లూరు మండలంలోని కుండుగారి కుంట గ్రామ పోలాల పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పేకాట శిబిరానికి కూడా రోజుకు  30 నుంచి 45 మంది దాక పేకాట రాయుళ్లు బయట నుంచి వస్తున్నారు. వచ్చిన వారు పేకాటలో దాదాపు రూ.30 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా పేకాట నిర్వహకుడు వచ్చిన పేకాట రాయుళ్ల అందరి వద్ద నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు మేజు రూపంలో వసూల్‌ చేస్తున్నారు. నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు ఎదురు చెప్పకుండా పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాట వినని పోలీసు సిబ్బంది ఎవరైనా ఉంటే తాడిపత్రి ప్రాంతానికి చెందిన  కొంత మంది అధికార పార్టీ నాయకుల ద్వారా ఫోన్లు చేయించి వారి దారిలోకి తెచ్చుకుంటున్నట్లు సమాచారం.

సరైన సమాచారం లేదు
యల్లనూరు మండలంలో కొన్నిచోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే సరైన సమాచారం లేదు. ఇప్పటికే పేకాట శిబిరాలను కనుగొనడం కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పక్క సమాచారం తెలిసిన వెంటనే శిబిరాలపై దాడులు నిర్వహిస్తాం. పేకాట శిబిరాలను నిర్వహించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదు.– హారున్‌బాషా, ఎస్‌ఐ, యల్లనూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement