భలే మంచి రోజు..! | Candidates Are Seeing For Good Muhurtham For Nominations | Sakshi
Sakshi News home page

భలే మంచి రోజు..!

Mar 17 2019 1:05 PM | Updated on Mar 17 2019 1:05 PM

Candidates Are Seeing For Good Muhurtham For Nominations - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం, నామినేషన్లు వేయడానికి రోజులు దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతుల వద్దకు పరుగు పెడుతున్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు, చిన్నాచితకా పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు ఇలా ప్రతి ఒక్కరికీ ఎన్నికల సెంటిమెంట్‌ ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నామినేషన్‌ వేయడానికి మంచి ముహూర్తంతో పాటు తమ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రచారాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే సెంటిమెంట్‌ను వీరంతా ఫాలో అవుతుంటారు. 

8 రోజులే చాన్స్‌ 
ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు ఎన్నికల  కమిషన్‌ అవకాశం కల్పించింది. ఈ 8రోజుల్లో అభ్యర్థుల జాతకం ప్రకారం, తిథి, వార, నక్షత్రం ఆధారంగా సిద్ధాంతులు మంచిరోజులను నిర్ణయిస్తారు. ఈ పద్ధతి ఎప్పటి నుంచి ఆచరణలో ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి ముహూర్తాల కోసం అన్వేషిస్తున్నారు. ఈసారి నామినేషన్లకు కేవలం 8 రోజులు మాత్రమే గడువు ఉండగా..వాటిలో 18వ తేదీ ద్వాదశి, 19న త్రయోదశి, 22వ తేదీ విదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా లెక్కలు వేసుకుంటున్నారు. నామినేషన్లకు చివరిరోజైన 25వ తేదీన పంచమి సోమవారం బలమైన ముహూర్తం ఉండడంతో ఆరోజు నామినేషన్లు వేస్తే శుభం కలగుతుందని పండితులు చెబుతున్నారు. 

పేరు, జన్మనక్షత్రం, జాతకమే కీలకం..
అయితే పోటీచేసే అభ్యర్థిపేరు, జన్మనక్షత్రం, జాతకం ప్రకారమే ముహూర్తం  నిర్ణయించాల్సి ఉంటుందని పడింతులు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఈ నాలుగురోజులు పండితులు, సిద్ధాంతులను రాజకీయ నాయకులు ఊపిరి సలపనివ్వరని తెలుస్తోంది. నామినేషన్‌ ముహూర్తంతో పాటు ఎన్నికల ప్రచారం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇప్పటికే పండితులు సూచించిన విధంగా కొంతమంది మొదలు పెట్టారు.

మరికొంతమంది నిర్దిష్ట సమయం కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గానికి ఈశాన్యం నుంచి ప్రారంభించడం పరిపాటిగా జరుగుతుంది. అయితే కొందరు నాయకులు మాత్రం గతంలో ప్రచారం ప్రారంభించిన ప్రాంతాన్నే తమ సెంటిమెంట్‌గా భావించి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఆ సెంటిమెంట్లు ఎవరిని విజేతలుగా నిలుపుతాయో వేచి చూడాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement