
రావెల తొలగింపునకు నిరసనగా ప్రత్తిపాడులో దళితుల నిరసన
మంత్రివర్గ విస్తరణ అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి ..
♦ చిచ్చురేపిన మంత్రివర్గ విస్తరణ
♦ రగిలిపోతున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు
సాక్షి నెట్‌వర్క్: మంత్రివర్గ విస్తరణ అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమను తీవ్రంగా అవమానిం చిన టీడీపీలో ఇక ఉండబోమంటూ రాజీనామాలు చేస్తున్నారు.
ఇలా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అవసరమైతే తానే సొంతంగా పార్టీ పెడతా నని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బొజ్జల అనుచరులంతా ఆయన బాటలోనే పార్టీని వీడుతున్నారు.
చింతమనేని రాజీనామా
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆదివారం దెందులూరు నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుచరులతో సమావేశమయ్యారు. తనకు ప్రజాప్రతినిధిగా కొనసాగడం ఇష్టం లేదని చెప్పారు. వేరే పార్టీలోకి వెళ్లనని, కావాలంటే సొంతంగా పార్టీ పెడతానని ప్రకటించారు.చింతమనేని ఏలూరు నుంచి నేరుగా విజయవాడ వెళ్లారు. అక్కడ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఇంటికి వెళ్లి, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పి రాజీనామా లేఖను ఇచ్చారు. తర్వాత సీఎం తో భేటీ అయ్యారు.
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే బండారు
విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి తాజా విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో ఆయన తన గన్‌మెన్, వ్యక్తిగత కార్యదర్శిని సరెండర్ చేశారు. తన జాడ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తనను కనీసం పరిగణనలోకి తీసుకోక పోవడం బాధాకరమని బండారు ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
అనిత, సర్వేశ్వరరావు,ఎంవీవీఎస్ మూర్తి అసంతృప్తి
మంత్రివర్గంలో చోటు కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించిన పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులతోపాటు సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నారు.
శ్రీకాళహస్తి టీడీపీ నేతల రాజీనామా
రాష్ట్ర మంత్రివర్గంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డికి చోటు దక్కడం చిత్తూరు జిల్లా టీడీపీలో సెగలు పుట్టిస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాద వ్ సైతం అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆదివారం దాదాపు 300 మంది టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
టీడీపీ పదవికి ఎమ్మెల్యే గోరంట్ల రాజీనామా
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను టీడీపీ చంద్రబాబుకు,పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వీవీవీఎస్ చౌదరికి పంపించారు. ఆ లేఖను వాట్సాప్‌లో మీడియా ప్రతినిధులకు పంపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లేఖలోని అంశాలను ప్రస్తావించారు. కాగా, గోరంట్ల కు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ప్రకటించారు.
దూళిపాళ్ల, మోదుగుల,యరపతినేని అసంతృప్తి
గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పొన్నూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ధూళిపాళ్ల నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే నరేంద్ర స్పందిస్తూ.. రెండు రోజుల్లో శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు సమావేశమై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఆశించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని కూడా బాబు తీరుపై లోలోన మధనపడుతున్నారు.
దళితుడు అయినందుకే రావెలను తొలగించారు
‘‘కేబినెట్‌లో నేరచరిత్ర ఉన్నవాళ్లు, అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జోలికి వెళ్లకుండా, కుల రాజకీయం చేసి, మచ్చలేని మనిషి రావెల కిషోర్‌బాబుపై వేటు వేయడం ఏమిటి? కుల వివక్షతోనే చంద్రబాబు ఇలా చేశారు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో 2019 ఎన్నికల్లో చూపిస్తాం’’ అని అంటూ దళితులు తేల్చిచెప్పారు. రావెలను మంత్రి పదవి నుంచి తొలగించడంను నిరసిస్తూ ఆదివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దళితులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.