రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.
- ఉదయం 9.25 గం. ముహూర్తం
- నారా లోకేష్‌తో సహా 7 లేదా 8 మందికి అవకాశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన చంద్రబాబు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌కు వివరించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సహా మంత్రివర్గంలోకి ఏడెనిమిది మందిని కొత్తగా తీసుకోవచ్చని తెలుస్తోంది.
మంత్రి కిమిడి మృణాళినిని కేబినెట్ నుంచి తప్పించవచ్చని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం చినరాజప్పను కేబినెట్ నుంచి తప్పించి.. పార్టీ బాధ్యతలను అప్పగించవచ్చని సమాచారం. ఉద్వాసన పలికేవారి జాబితాలో కొల్లు రవీంద్ర, రావెల కిషోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, శిద్ధా రాఘవరావు పేర్లు వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత వంటివారి శాఖల్లో మార్పులుండవచ్చని చెబుతున్నారు. కేబినెట్‌తో బెర్త్ ఖాయమైందంటూ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, పితాని సత్యనారాయణ, కాగిత వెంకట్రా వు, సుజయకృష్ణ రంగారావు, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ, శ్రీరాం తాతయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి.