బైబై బాబూ.. ఇదే ప్రజాతీర్పు | Bye Bye Babu | Sakshi
Sakshi News home page

బైబై బాబూ.. ఇదే ప్రజాతీర్పు

Apr 6 2019 8:07 AM | Updated on Apr 6 2019 8:19 AM

Bye Bye Babu - Sakshi

కొత్తపేట సభలో షర్మిల అభివాదం. చిత్రంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చిర్ల జగ్గిరెడ్డి, చింతా అనురాధ

సాక్షి, రావులపాలెం/ఆలమూరు (కొత్తపేట): జనతరంగం ఉవ్వెత్తున ఎగసిపడింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో రహదారులు జన ఏరులుగా మారిపోయాయి. ప్రధాన వీధులన్నీ తిరునాళ్లను తలపించాయి. మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. ‘జై జగన్‌.. సీఎం సీఎం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు చేసిన నినాదాల హోరు ఆ ప్రాంతమంతటా ప్రతిధ్వనించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాకతో కొత్తపేట జనసంద్రంగా మారిపోయింది.

ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపించింది. అశేష జనవాహిని మధ్య కొత్తపేట పాతబస్టాండ్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబడుతూ, చంద్రబాబు అవినీతిని ఎండగడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజల్ని ఆలోచింపజేసేలా ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి సభికులు హర్షధ్వానాలు తెలిపారు. చప్పట్లతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ‘‘బైబై బాబూ.. ఇదే ప్రజాతీర్పు, బైబై బాబూ.. ఇదే ప్రజాతీర్పు’’ అంటూ ఆమె పలికిన ముగింపు మరింత ఆకట్టుకుంది.


దోపిడీయే పరమావధిగా చంద్రబాబు పాలన
అవినీతి, అరాచకం, అన్యాయం, అధర్మం, వెన్నుపోటు రాజకీయాలతో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబుకు నిజం మాట్లాడే దమ్ము, ధైర్యం లేవని షర్మిల ఘాటుగా విమర్శించారు. జగన్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. నాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చేలా పాలన సాగిస్తే.. నేడు చంద్రబాబునాయుడు దోపిడీయే పరమావధిగా పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ రెండు మాటలు మాట్లాడతానని చెప్పడానికే ఆయన తన పర్యటనల్లో రెండు వేళ్లు చూపిస్తారన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు, డ్వాక్రా, చేనేత, రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పి ప్రజలను మభ్యపెట్టారన్నారు. మూడేళ్లుగా డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ ఇవ్వకుండా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఆ వడ్డీలో స్వల్ప మొత్తాన్ని పసుపు – కుంకుమగా ఇచ్చి మహిళలను మరోసారి మోసగిస్తున్నారని షర్మిల చెప్పారు.


జగన్‌ పోరాటంతోనే సజీవంగా ‘హోదా’ నినాదం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గడచిన ఐదేళ్లుగా ధర్నాలు, నిరసనలు, సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం రప్పించినందు వల్లనే ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ నినాదం నేటికీ సజీవంగా ఉందని షర్మిల అన్నారు. కేంద్రంతో నాలుగేళ్లు కాపురం చేసి ‘ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీయే ముద్దు’ అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. జగన్‌ మాత్రమే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారన్నారు. జగనన్నకు ఒక్కసారి అవకాశం ఇస్తే చెప్పిందే కాదు.. అవసరాన్నిబట్టి చెప్పనివి కూడా చేసి చూపించి ప్రజారంజక పాలన అందిస్తారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవడం ద్వారా నాటి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకువద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

జగనన్న పాలనలో ప్రతి రైతూ తలెత్తుకు బతుకుతాడని, డ్వాక్రా మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉంటారని, వృద్ధులు, దివ్యాంగులకు మరింత అండదండలు దొరుకుతాయని భరోసా ఇచ్చారు. సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అమలాపురం ఎంపీ అభ్యర్థి చింతా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని షర్మిల కోరారు. వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ చిహ్నమైన సీలింగ్‌ ఫ్యాన్‌ను తిప్పుతూ ప్రజలకు అభివాదం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement