 
															ఎండలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినులు
వెంకటగిరి: జిల్లాలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అప్పుడే తడాఖా చూపుతున్నాయి. మార్చి మొదటివారంలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. ఈ నెలాఖరుకు ఎండలు మరింత తీవ్రం కావడంతోపాటు వడగాల్పులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలియజేసింది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఈ వేసవిని తట్టుకోవడం ఓ పరీక్షగా మారనుంది.
రెండు రోజులుగా మండు వేసవిని తలపించేలా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విచ్చలవిడిగా బోరుబావుల ద్వారా భూగర్భజలాలను తోడేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కారణం అవుతుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.  ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లోకి చేరిన అరకొర నీరు ఇప్పటికే అడుగంటింది. దీంతో మూగజీవాలకు గుక్కెడు నీరు కరువయ్యే పరిస్థితి నెలకొంది. కాగా రాత్రిళ్లు మంచు తీవ్రత ఎక్కువగా ఉండటం విశేషం.
వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీలు )
                       అత్యల్పం               అత్యధికం
ఫిబ్రవరి 25            21                     33
ఫిబ్రవరి 26            21                     34
ఫిబ్రవరి 27            21                     34
ఫిబ్రవరి 28            21                     33
మార్చి     1           22                     34
మార్చి     2           20                     35
మార్చి     3           20                     36
మార్చి     4           19                     34
మార్చి     5           25                     34

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
