బాబు... బురిడీ | Budget depression | Sakshi
Sakshi News home page

బాబు... బురిడీ

Mar 13 2015 2:10 AM | Updated on Oct 2 2018 4:53 PM

రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా నవ్యాంధ్ర నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందర్నీ నిరాశ పరిచింది.

రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిగా   నవ్యాంధ్ర నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందర్నీ నిరాశ పరిచింది. కరువు కోరల్లో        చిక్కుకున్న చిత్తూరు జిల్లా ప్రజల ఆశలను    వమ్ముచేసింది. అన్నదాత గుండెగుడిలో           గూడుకట్టుకున్న హంద్రీ-నీవా, గాలేరు- నగరి ప్రాజెక్టులను గాలికొదిలేసింది. సీఎం తన సొంత జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నివర్గాల వారు గళమెత్తారు. హైటెక్కుల బాబు అంకెల గారడీ చేసి పేదలను బురిడీ      కొట్టించారని మండిపడ్డారు.
 
తిరుపతి: రాష్ట్ర శాసన సభలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను విస్మయానికి గురిచేసింది. సీఎం సొంత జిల్లాపై మమకారం చూపలేదని బడ్జెట్ కేటాయింపుల బట్టే తెలిసిపోయింది. జిల్లా పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నీటి మూటలేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ-నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. దీంతో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాది లోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేసి జిల్లాలో సాగు, తాగు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని సీఎం పలుమార్లు ప్రకటించినా ఆ స్థాయిలో నిధులు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి, డ్వాకా మహిళల రుణ మాఫీ వంటి వాటికి నిధులు కేటాయించలేదు. దీంతో ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలకు గండి కొట్టేలా నిధుల కేటాయంపులు ఉన్నాయని అన్ని పక్షాల రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నేతలు పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే బడ్జెట్‌గా అభివర్ణించగా, కొంత మంది అంకెల గారడీగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. విమానాశ్రయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు లేవు. కేవలం విద్యాభివృద్ధికి సంబంధించి అరకొరాగానే నిధులు కేటాయించారు. ఈ రోజు శాసన సభలో సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హంద్రీ- నీవా ప్రాజెక్ట్ పనులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 90 శాతం పనులు పూర్తి అయినప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజీ నిర్మించి మూడేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్ట్ పనులు ఇంతవరకు పూర్తికాలేదు. ఈ విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు పలుప్రాంతాల్లో వారానికి ఒకసారి నీరిచ్చే పరిస్థితి నెలకొందన్నారు.

ఎన్నికల హామీలకు.. బడ్జెట్‌కు పొంతన లేదు

చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు పొంతన లేదు.  రైతుల రుణమాఫీ కంటితుడుపైతే, డ్వాక్రా మహిళల రుణమాఫీ పరిస్థితి అంతే.  బడ్జెట్‌లో డ్వాక్రా రుణాలకు తగినంత నిధులు కేటాయించలేదు. 2015-16లో ఇళ్లు లేని వారికి రెండు లక్షల ఇళ్లు ఇస్తామన్నారు కానీ నేడు మొక్కుబడిగా నిధులు కేటాయించారు. 2014-15లో కట్టినఇళ్లకు బిల్లులు ఇవ్వలేదు. ఇళ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంమీద ఈ బడ్జెట్ ఎంతమాత్రం సరిపోదు. కనీసం తాగునీటి కోసం సరిపడ నిధులు కేటాయించకపోవడం దారుణం.
 - పోకల అశోక్ కుమార్,
 వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement