షేర్లపై లాభాలొస్తే పన్ను!

budget 2018,10% tax announced on long-term equity profits - Sakshi

దీర్ఘకాలిక ఈక్విటీ లాభాలపై 10% పన్ను  

ఇన్వెస్ట్‌ చేసిన ఏడాదిలోపైతే 15 శాతం

సాక్షి, అమరావతి: ఇక నుంచి షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు ఎప్పుడు అమ్మినా వచ్చే లాభాలపై పన్ను చెల్లించక తప్పదు. షేర్‌ మార్కెట్‌ పరిభాషలో దీర్ఘకాలం అంటే ఇప్పటివరకూ ఏడాది! షేర్లు కొని ఏడాదిలోపు విక్రయిస్తే... ఆ లాభాలపై షార్ట్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ 15 శాతం చెల్లించాలి. అదే ఏడాది దాటాక విక్రయిస్తే ఆ లాభాలపై ఇప్పటిదాకా పన్ను లేదు. దీర్ఘకాలం షేర్లలో ఇన్వెస్ట్‌ చేయటాన్ని ప్రోత్సహించడానికి ఇది చేసేవారు. కానీ షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్నును విధిస్తున్నట్లు తాజా బడ్జెట్లో ప్రకటించారు. ఈ లాభం లక్ష రూపాయలు దాటితే పన్ను పడుతుంది. ఈ చెల్లించే పన్నుపై ఇండక్సేషన్‌ను (ద్రవ్యోల్బణ సూచీ) పరిగణనలోకి తీసుకోరు. జనవరి 31 వరకు వచ్చిన లాభాలను ఈ పన్ను పరిధిని నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే ఊరట. ‘గ్రాండ్‌ఫాదర్డ్‌’పేరిట జనవరి 31 వరకు ఉన్న షేర్ల ధర ఆధారంగా లాభాలను లెక్కిస్తారు. 

ఉదాహరణ చూద్దాం... 
ఏడాది క్రితం మీరు రూ.50 వద్ద కొన్న షేరు ధర జనవరి 31 నాటికి రూ.100కి ఉందనుకుందాం. అంటే ఇప్పటికే మీ షేరు ధర రెట్టింపయింది. ఇప్పుడు ఈ షేరును జూలైలో కూడా రూ.100 వద్ద అమ్మితే మీరు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగాక ఈ షేరును రూ.120కు అమ్మారనుకుందాం. మీ వాస్తవ లాభం రూ.70 అయినా రూ.20పై పన్ను చెల్లిస్తే చాలు. మిగతా రూ.50 లాభాన్ని జనవరి 31 నాటికే పొందారు గనక దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకూ లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది. అంటే ఇక నుంచి షేర్లు గానీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ గానీ ఇన్వెస్ట్‌ చేసిన ఏడాది తర్వాత అమ్మితే 10 శాతం, 12 నెలలలోపు అమ్మితే 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం షేర్ల క్రయవిక్రయాలపై చెల్లిస్తున్న లావాదేవీ పన్నుకు (ఎస్‌టీటీ) అదనం. అంటే ఇప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌పై రెండు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తుందన్నమాట. భూముల వంటి ఇతర ఆస్తుల్లో 36 నెలలు దాటితే లాంగ్‌టర్మ్‌ గెయిన్స్‌పై 20 శాతం, ఆ లోపయితే 30 శాతం పన్ను విధిస్తున్నారు. 

మ్యూచ్‌వల్‌ ఫండ్లనూ వదల్లేదు 
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌పై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ప్రతిపాదించిన జైట్లీ... ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్లు ఇచ్చే డివిడెండ్‌పైనా 10 శాతం పన్ను వేశారు. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును తప్పించుకోవటానికి ఇన్వెస్టర్లు డివిడెండ్‌ ప్లాన్లకు మళ్లకుండా చెక్‌ పెట్టడమే దీని ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిబంధన ప్రకారం ఇన్వెస్టర్లకు ఫండ్‌ సంస్థలు మిగులు నిల్వల నుంచి చేసే డివిడెండ్‌ చెల్లింపులపై పన్నును ముందుగానే చెల్లించాలి. ఇన్వెస్టర్లు నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్‌టీసీజీ అన్నది ఏడాది కాలం దాటిన పెట్టుబడులపై లాభం రూ.లక్ష మించితేనే చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ మాత్రం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ (డివిడెండ్‌ ప్లాన్లు)లో ఇన్వెస్ట్‌ చేసేవారందరూ చెల్లించాల్సినది. ప్రస్తుతం ఈక్విటీ పథకాలపై డివిడెండ్‌ పంపిణీ పన్ను లేదు. అయితే, డెట్‌ ఫండ్స్‌లో మాత్రం డివిడెండ్‌ పంపిణీపై 28.84 శాతం పన్ను ఇప్పటికే అమలవుతోంది.

స్వల్పకాలంలో ప్రభావం
డివిడెండ్‌నే ఆదాయంగా భావించే వారిపై తాజా పన్ను గణనీయమైన ప్రభావమే చూపనుంది. తాజా పన్ను ప్రతిపాదనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అభిప్రాయపడ్డారు. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయించినప్పుడు 0.001% సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ‘‘సెంటిమెం ట్‌ ఆధారిత పెట్టుబడుల ఉపసంహరణలు చోటు చేసుకోవచ్చు. అలాగే, ఎల్‌టీసీజీ వల్ల స్వల్పకాలంలో నిధుల ప్రవాహం కూడా నిదానించ వచ్చు. అయితే దీర్ఘకాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండదు’’అని మార్నిం గ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా డైరెక్టర్‌ కౌస్తభ్‌ బేలపుర్కార్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top