అమర జవానుకు అశ్రునివాళి

Bsf Javan Killed In Maoist Attack - Sakshi

సాక్షి, రామచంద్రపురం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన శీలం రామకృష్ణ (30) వీరమరణం పొందారు. ఆయ న మృతదేహాన్ని బీఎస్‌ఎఫ్‌ నేతృత్వంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పట్టణంలోని శీలంవారి సావరంలో ఉన్న ఆయన ఇంటికి శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన ఆయన మృతదేహాన్ని పట్టణ వాసులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సేవలకు గౌరవ సూచకంగా జవాన్లు గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపి, వందనం సమర్పించారు. విశాఖపట్నం, కాకినాడ నుంచి వచ్చిన బీఎస్‌ఎఫ్‌ అధికారులు, జవాన్లు రామకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
వీర జవాను రామకృష్ణ మృతదేహం ఇంటికి చేరుకోగానే భార్య సౌందర్య, ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బీఎస్‌ఎఫ్‌లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రామకృష్ణకు 2016లో సౌందర్యతో వివాహం జరిగింది. ఇటీవల ఇంటికి వచ్చిన రామకృష్ణ మాటల సందర్భంగా తన మామయ్యతో ‘‘నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దురుగాని’’ అని అన్నారు. రామకృష్ణ అంత్యక్రియల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజల్ని చూసి.. ఆ మాటలే గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముని గిపోయారు. ఆర్డీఓ ఎన్‌.రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఎస్సై ఎస్‌.లక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ సురేంద్ర, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్మశాన వాటికలో రామకృష్ణ మృతదేహానికి వైఎస్సార్‌ సీపీ రామచంద్రపురం ఎమ్మె ల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు శ్రద్ధాంజలి ఘటించి, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top