ప్రాణం తీసిన క్రికెట్ | boy dies after shock incident in asifabad | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన క్రికెట్

Jan 17 2014 4:24 AM | Updated on Sep 5 2018 2:26 PM

బూర్గుడ గ్రామానికి చెందిన రైతు లోకండే నాగయ్య, లక్ష్మీ దంపతుల నాలుగో కుమారుడు సాయికిరణ్(15) ఆసిఫాబాద్‌లోని వాసవి విద్యామందిర్‌లో పదో తరగతి చదువుతున్నాడు.

ఆసిఫాబాద్, న్యూస్‌లైన్: బూర్గుడ గ్రామానికి చెందిన రైతు లోకండే నాగయ్య, లక్ష్మీ దంపతుల నాలుగో కుమారుడు సాయికిరణ్(15) ఆసిఫాబాద్‌లోని వాసవి విద్యామందిర్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామంలోని రైస్‌మిల్లు వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బంతి వెళ్లి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కంచెలో పడింది. బంతిని పట్టుకునేందుకు పరుగెత్తిన సాయికిరణ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గమనించకుండా లోపలికి వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్‌కు గురై సాయికిరణ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అతడి వెనుకాల వెళ్లిన ఇదే గ్రామానికి చెందిన జనగాం పెంటయ్య, పద్మ దంపతుల కుమారుడు ప్రసాద్ కూడా షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న స్నేహితులు గమనించి కర్రతో కొట్టగా.. తీవ్ర గాయాలై ప్రాణాలతో బయపడ్డాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కాగజ్‌నగర్‌కు తరలించారు.
 
 విషాదం మిగిల్చిన సెలవులు
 సంక్రాంతి సెలవులు సాయికిరణ్ కుటుంబంలో విషాదం మిగిల్చాయి. సాయికిరణ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. ఆసిఫాబాద్‌లోని విద్యామందిర్‌లో చదువుతూ స్నేహితులు, విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి మెలిసి ఉండేవాడు. మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి కుటుంబాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాదరావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, సర్పంచ్ మెకర్తి కాశయ్య, వాసవి విద్యామందిర్ ఉపాధ్యాయులు పరామర్శించారు. ఎస్సై సాదిక్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement