కంటి దీపం ఆరిపోయింది..

Blind Teacher Wife Died With Heart Stroke Srikakulam - Sakshi

అంధ ఉపాధ్యాయుడి ఇంట విషాదం

అన్నీ తానై నడిపించిన సతీమణి హఠాన్మరణం

భర్తతో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుండెపోటు

దారి చూపిన దేవత వెళ్లిపోయింది.. కంటి వెలుగై ఇంటి దీపమై కాంతులీనిన సహచరి హఠాత్తుగా కనుమరుగైపోయింది. ఇక నా బతుకంతా కటిక చీకటేనంటూ హృదయవిదారకంగా సాగిన అతని రోదన చూపరులకు సైతం కన్నీరు తెప్పించింది. ఓ అంధ ఉపాధ్యాయుడితో విధి ఆడిన విషాద నాటకమిది. అన్నీ తానై నిలిచి పెద్ద దిక్కుగా ఉన్న సతీమణి గుండెపోటుతో క్షణాల్లోనే కన్నుమూయడం ఆ అభాగ్యుడి గుండెల్లో గునపాలు దింపింది.

శ్రీకాకుళం, ఆమదాలవలస:  కనుచూపు దూరం చేసి భగవంతుడు ఓసారి అన్యాయం చేశాడు.. దీపంలాంటి భార్యనిచ్చి ఆ లోటును భర్తీ చేశాడు.. వారికి రత్నాల్లాంటి ఇద్దరు కుమార్తెలు.. సజావుగా సాగుతున్న వారి జీవితంలో ఎందుకో హఠాత్తుగా విషాదం నింపాడు. భర్తను బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై తీసుకువెళుతుండగా.. హృద్రోగానికి గురై అంధ ఉపాధ్యాయుడి భార్య క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వెంకయ్యపేట గ్రామంలో విషాదం నింపింది. ఈ మండలంలోని చిన్న జొన్నవలస గ్రామంలోని ఎంపీఈపీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బగాన వెంకటరమణమూర్తి.. పదో తరగతి చదువుతున్న సమయంలోనే చూపునుకోల్పోయారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ (హిస్టరీ) చదివి, అనంతరం మచిలీ పట్నంలోగల బీఈడీ కళాశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ ట్రైయినింగ్‌ తీసుకొని బీఈడీ పూర్తి చేశారు. డీఎస్సీలో ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు.  పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పద్మావతి తనను ఆదర్శ వివాహం చేసుకోవడంతో ఆయన జీవితంలో కొత్త వెలుగు వచ్చింది. ఉదయం లేచిన వెంటనే బ్రష్‌ అందించడం దగ్గర నుంచీ ద్విచక్ర వాహనంపై స్కూలుకు తీసుకువెళ్లి ఇంటికి తెచ్చే వరకు అన్నీ తానే అయి ఆమె కంటికి రెప్పలా చూసుకునేవారు. వీరికి డిల్లేశ్వరి, లావణ్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు.  
మృత్యువు కమ్ముకొచ్చిందిలా...
రోజూలాగే పద్మావతి (40) బుధవారం ఉదయం భర్తను పాఠశాలకు విధులకు తీసుకు వెళ్లి అక్కడే  ఉండి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం  నవనంబాబు, పొన్నాం గ్రామాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులు గ్రామదేవత పండగకు పిలవడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ద్విచక్రవాహనంపై తన భర్తను తీసుకొని బయల్దేరారు. మార్గమధ్యంలో గేదెలవానిపేట కాలనీ వద్ద ఆమెకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. తనకు బాగులేదని చెబుతూ ద్విచక్రవాహనం నడపలేక పక్కనే ఉన్న పొలాల్లో బండి ఆపారు. స్థానికులు గమనించి ఆమెను రోడ్డు పైకి తీసుకువచ్చి 108కు ఫోన్‌ చేశారు. వెంటనే వచ్చిన 108 వాహనం సిబ్బంది అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. దీంతో ఆ అంధ ఉపాధ్యాయుడి రోదన అక్కడి వారిని కలచివేసింది. ఇక తనకు దిక్కెవరంటూ ఆయన  గొంతులోంచి తన్నుకొస్తున్న విషాదం చూసి కంట తడి పెట్టని వారు లేరు. పద్మావతి భౌతిక కాయానికి వెంకయ్యపేట గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top