జిల్లాలో బీహార్ ఆయుధాలు యథేచ్ఛగా విక్రయిస్తున్నట్టు సమాచారం.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో బీహార్ ఆయుధాలు యథేచ్ఛగా విక్రయిస్తున్నట్టు సమాచారం. ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వెలువడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల కిందట ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వినికిడి. వీరి నుంచి నాలుగు మారణాయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సదాశివపేట మండలం నందికందిలో ఓ ఆటో డ్రైవర్ కుమారుడిని అదుపులోకి తీసుకుని రెండు దేశీయ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పటాన్‌చెరు మండలం రుద్రారంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ఓ యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ ముఠా అక్రమంగా ఆయుధాలను తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక పోలీసులు మాత్రం వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.