అమ్మకానికి తుపాకీ..!  | A team of friends sold the weapon illegally | Sakshi
Sakshi News home page

అమ్మకానికి తుపాకీ..! 

Dec 28 2018 12:38 AM | Updated on Dec 28 2018 12:53 AM

A team of friends  sold the weapon illegally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆయుధాన్ని అక్రమంగా బిహార్‌ నుంచి తీసుకువచ్చి వాట్సాప్‌ ద్వారా రూ.60 వేల రేటుకు అమ్మకానికి పెట్టిన ఓ మిత్రుల బృందం గుట్టును హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. అక్కడి ఛాబ్రా ప్రాంతంలో తయారైన ఆయుధాన్ని ఎక్కువ రేటుకు అమ్మేందుకు ఓ వ్యక్తి ఖరీదు చేయగా... అది అనేక చేతులు మారి ఓ ఆభరణాల వ్యాపారి వద్దకు వచ్చింది. అతను ఓ వ్యక్తికి తాను ఇచ్చిన అప్పునకు గాను తుపాకీని జమ చేసుకోవడం కొసమెరుపు. ఈ జట్టుకు చెందిన మొత్తం ఆరుగురిని పట్టుకుని, నాటు తుపాకీ , మూ డు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు.  

టీ తాగి వచ్చేలోపు... 
బిహార్‌ రాజధాని పట్నాకు 30 కిమీ దూరంలోని ఛాబ్రా ప్రాంతం అడవికి దగ్గరలో ఉంటుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఇక్కడ నాటు తుపాకుల్ని తయారు చేసే కొన్ని కార్ఖానాలు వెలిశాయి. అక్కడ నాటు రివాల్వర్, పిస్టల్స్‌కు చెందిన విడి భాగాలను తయారు చేసి ఛాబ్రా వరకు తీసువచ్చి భద్రపరుస్తా రు. కొనుగోలుదారుడు ఎవరైనా వచ్చి తుపాకీకి డ బ్బు చెల్లిస్తే... దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి టీ తాగి రమ్మంటారు.దానికి పట్టే పావు గంటలో విడిభాగాలను అసెంబుల్‌ చేసి తుపాకీ సిద్ధం చేసి అందిస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర లోని పుణేలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న హుస్సేన్‌ గౌస్‌ మహ్మద్‌ ఖాన్‌ స్వస్థలం ఛాబ్రా. కొన్నాళ్ల క్రితం అక్కడకు వెళ్లిన ఖాన్‌ రూ.20 వేలు వెచ్చించి ఓ నాటు పిస్టల్, మూడు తూటాలు కొన్నాడు.  

విక్రయం కోసం సిటీకి తీసుకువచ్చి... 
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పి.ప్రకాష్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితమే పుణేకు వలసపోయింది. అక్కడ ఉండగా తమ ఇంటి సమీపంలో నివసించే ఖాన్‌తో ఇతడికి పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ప్రకాష్‌ హైదరాబాద్‌కు వచ్చేసినా వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇలా ఖాన్‌ తాను ఖరీదు చేసిన తుపాకీ విషయం ఇతడికి చెప్పి విక్రయించమన్నాడు. అలా వచ్చిన మొత్తం ఇద్దరం పంచుకుందామని చెప్పాడు. అంగీకరించిన ప్రకాష్‌ ఆయుధం తీసుకువచ్చాడు. అతనికి ఓ వివాహ సందర్భంలో పరిగికి చెందిన జె.మోహన్‌తో పరిచయమైంది. దీంతో తుపాకీని అమ్మిపెట్టమని,లాభం పంచుకుందామంటూ అతనికి అందించాడు. ఇలా ముగ్గురూ దీని అమ్మకంపై దృష్టి సారించి ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. 

చిత్రంగా జ్యువెల్లరీ షాపు యజమాని వద్దకు... 
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మోహన్‌ కొన్నాళ్ల క్రితం పరిగికి చెందిన అజయ్‌ జ్యువెల్లర్స్‌ యజమాని నరేంద్ర చౌదరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చాలని నరేంద్ర ఇటీవల ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన మోహన్‌ తన వద్ద ఓ నాటు తుపాకీ ఉందని, దాన్ని అమ్మి ఆ డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు.సమ్మతించిన నరేంద్ర తానే విక్రయిస్తానని, వచ్చిన మొత్తంలో తన బాకీ మినహాయించుకుని మిగిలింది ఇస్తాననడంతో మోహన్‌ పిస్టల్‌ను అతనికి అప్పగించాడు. కొన్నాళ్లకు నరేంద్ర దాన్ని భద్రపరచమని సికింద్రాబాద్‌కు చెందిన తన స్నేహితులు నేమి చాంద్, గన్‌పత్‌ జట్‌లకు ఇచ్చాడు.  

వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసేసరికి... 
కొన్నాళ్లుగా ఈ పిస్టల్‌ ఖరీదు చేసే కస్టమర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించిన నరేంద్ర తన స్నేహితుల బృందానికి చెందిన ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో ‘రూ.60 వేలకు వెపన్‌ ఫర్‌ సేల్‌’అంటూ పోస్టింగ్‌ పెట్టాడు. నిజమా? కాదా? అంటూ కొందరు చాట్‌ చేయడంతో ఆధారాలకోసం పిస్టల్‌ ఫొటో, తూటాల చిత్రం పెట్టాడు. ఈ విషయం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు దృష్టికి వచ్చింది. ఆయన నేతృత్వంలో పోలీసు బృందాలు వరుసదాడులు చేశాయి. ఫలితంగా ఆరుగురు నిందితులు అరెస్టు కావడంతో పాటు తుపాకీ, తూటాలు రికవరీ అయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement