
పెత్రమాసకు ముందే పెద్ద పండుగ
ఆరు దశాబ్దాల కల.. ఫలించింది. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ ప్రజానీకం ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. దీంతో తెలంగాణ ప్రజలెంతో ఇష్టంగా జరుపుకొనే పెత్రమాస (బతుకమ్మ పండుగ మొదలయ్యే మహాలయ పితృ అమావాస్య)కు ముందే.. పెద్ద పండుగ వచ్చినట్లయింది.
సాక్షి, నెట్‌వర్క్ :
ఆరు దశాబ్దాల కల.. ఫలించింది. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ ప్రజానీకం ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. దీంతో తెలంగాణ ప్రజలెంతో ఇష్టంగా జరుపుకొనే పెత్రమాస (బతుకమ్మ పండుగ మొదలయ్యే మహాలయ పితృ అమావాస్య)కు ముందే.. పెద్ద పండుగ వచ్చినట్లయింది. ఇక గౌరమ్మ గడప (తెలంగాణ)లో గంపెడానందం పెల్లుబికింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఏసీ నాయకులతోపాటు తెలంగాణవాదులు ఊరూరా స్వీట్లు పంచుకొని, ఉత్సాహంతో సంబురాలు జరుపుకొన్నారు. తెలంగాణ సంస్కృతితో ముడివేసుకున్న బతుకమ్మ పండుగ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుండడంతో పది జిల్లాల ప్రజలు ఈ రెండింటిని కలగలిపి జోడుగా సంబరాలు జరుపుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.
వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, అమరవీరుల స్థూపం, ములుగు, జనగామ, పరకాల, నర్సంపేట, డోర్నకల్, మహబూబాద్ ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణవాదులు గురువారం రాత్రి సంబరాలు నిర్వహించుకున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటాలు పట్టుకుని నినాదాలు చేశారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో వేడుకలు జరిపారు. ఖమ్మంలో టీజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా కాల్చారు. భద్రాచలంలో జేఏసీ, సీసీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం, పాల్వంచలో కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసి, ర్యాలీ నిర్వహించారు. మణుగూరులో జేఏసీ నాయకులు అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బయ్యారం, గార్ల, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో ర్యాలీలు జరిపి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సత్తుపల్లిలో జేఏసీ, సీపీఐ నాయకులు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో టీ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచారు. సంగారెడ్డిలో టీజేఏసీ నేతృత్వంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఆంథోల్, తొగుట, తూప్రాన్, గజ్వేల్‌లో కూడా సంబరాలు జరిపారు.
మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్‌రెడ్డి నేతృతృంలో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. అచ్చంపేటతోపాటు జిల్లా అంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు, భైంసా, దండేపల్లిలో బాణసంచాపేల్చి సంబరాలు జరుపుకొన్నారు.
నల్లగొండ జిల్లాకేంద్రంలో ‘ప్రత్యేక’ సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, శ్రీకాంతాచారి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ తీశారు. టీఆర్‌ఎస్, టీర్‌ఆర్‌ఎస్‌వీ, టీజేఏసీ, తెలంగాణ జాగృతి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. పరస్పరం రంగులు చల్లుకుని డాన్సులు చేశారు. భువనగిరి, మిర్యాలగూడ, దామర చర్ల, చౌటుప్పల్, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లో తెలంగాణవాదులు సంబరాలు జరుపుకొన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీజేఏసీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా కాల్చి, రంగులు చల్లుకున్నారు.
రాజధానిలో ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీతోపాటు చిక్కడపల్లి దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, చాదర్‌ఘాట్, తార్నాక, అంబర్‌పేట, గుడిమల్కాపూర్, తదితర అనేక ప్రాంతాల్లో వివిధ జేఏసీలు, తెలంగాణ మద్దతుదారులు, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఉత్సాహంతో మిఠాయిలు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకొని విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్‌లో మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చారు. మల్లాపూర్ చౌరస్తా, అంబర్‌పేట నియోజకవర్గంలోని అలీకేఫ్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గుడి మల్కాపూర్ తదితర ప్రాంతాల్లోనూ బాణాసంచాలు కాల్చారు. మిఠాయిలు పంచి, రంగులు చల్లుకుని నృత్యాలు చేశారు.