రెవెన్యూ శాఖకు షాక్ | bifurcation effect on revenue department | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖకు షాక్

May 26 2014 2:58 AM | Updated on Sep 27 2018 5:46 PM

రాష్ట్ర విభజన ప్రభావం రెవెన్యూ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏర్పాటైన భూసేకరణ యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆ శాఖలో అలజడి రేపుతోంది.

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:  రాష్ట్ర విభజన ప్రభావం రెవెన్యూ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏర్పాటైన భూసేకరణ యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆ శాఖలో అలజడి రేపుతోంది. ఇందుకు సంబంధించి జారీ అయిన జీవో ఎంఎస్ నెం.67 కారణంగా జిల్లాలో నాలుగు భూసేకరణ యూనిట్లు రద్దు కానున్నాయి. కలెక్టరేట్‌లోని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో జిల్లాలో ఐదు, అనంతపురం జిల్లాలో ఒక యూనిట్ ఉంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో 23, తెలంగాణలో 5 యూనిట్లు రద్దు కానున్నాయి. జిల్లాకు సంబంధంచి 5 యూనిట్లుండగా నంద్యాలలోని తెలుగుగంగ భూసేకరణ యూనిట్, హంద్రీనీవా సుజల స్రవంతి 3-4 యూనిట్‌లు, కలెక్టరేట్‌లోని భూసేకరణ, పునరావాసం(ఎల్‌ఏ అండ్ రీహాబిటేషన్) యూనిట్లు రద్దు కానున్నాయి. వీటిని నంద్యాలలోని ఎస్సార్బీసీ భూసేకరణ యూనిట్‌లో కలపనున్నారు.
 
 ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత..
 భూసేకరణ యూనిట్ల రద్దుకు సంబంధించిన జీవో నెంబర్ 67ను రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భూసేకరణ యూనిట్లలో పనిచేస్తున్న వారందరూ రెవెన్యూ శాఖకు చెందినవారే కావడంతో వీటి రద్దు కారణంగా వారంతా తిరిగి మాతృశాఖకు రానున్నారు. ఈ యూనిట్లలో పని చేస్తున్న దాదాపు 20 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాకు సంబంధించి నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, 14 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 20 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు తిరిగి రెవెన్యూ శాఖకు రానున్నారు. పలు పోస్టులు రద్దు కానున్నాయి. వీరందరూ రెవెన్యూ శాఖకు రావడం వల్ల సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో పదోన్నతులు రాకపోగా చివరిగా ప్రమోషన్‌లు పొందినవారికి రివర్షన్లు తప్పేలా లేవు.

దీంతో జిల్లా కలెక్టర్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్లు మాత్రం కర్నూలులో ఒక భూసేకరణ యూనిట్‌ను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. స్పెషల్ కలెక్టర్ కంట్రోల్‌లో అనంతపురం జిల్లాలో ఉన్న భూసేకరణ యూనిట్‌ను అదే జిల్లాలో కలిపివేయాలని సూచించారు. రద్దు నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. జీవో అమలును నిలుపుదల చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement